Can Children Use Adult Soaps?: చిన్నపిల్లల చర్మం ఎంత సున్నితంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే చాలా మంది పుట్టినప్పటి నుంచి కొన్ని సంవత్సరాల వయసు వరకు వారికి ఉపయోగించే సోప్స్, జెల్స్, లోషన్స్, షాంపూ విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. చర్మం పొడిబారకుండా, కందిపోకుండా ఎప్పుడూ తేమను అందించే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే కొందరు పేరెంట్స్ పిల్లలకు సంవత్సరం వయసు రాగానే ఇంట్లో పెద్దవాళ్లు ఉపయోగించే సబ్బులు వాడుతుంటారు. అసలు ఇలా పెద్దవాళ్లు ఉపయోగించే సబ్బులు వాడొచ్చా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
పిల్లల చర్మం పెద్దవాళ్ల చర్మం కంటే చాలా సున్నితంగా ఉంటుంది. పెద్దవాళ్లకు తగిన సబ్బులు పిల్లల చర్మాన్ని పొడిగా చేసి, చికాకును కలిగించవచ్చని నిపుణులు అంటున్నారు. అందుకోసం పిల్లలకు ప్రత్యేకంగా రూపొందించిన సబ్బులను ఉపయోగించడం చాలా ముఖ్యమంటున్నారు. ఈ సబ్బులు పిల్లల చర్మం సహజ నూనెలను తొలగించకుండా, చర్మాన్ని శుభ్రంగా, తేమగా ఉంచడానికి సహాయపడతాయని అంటున్నారు.
అలాగే ఏడాదిలోపు పిల్లలకు వాడే ఉత్పత్తులను జాగ్రత్తగా ఎంచుకోవాలని సౌందర్య నిపుణులు డాక్టర్ శైలజ సూరపనేని చెబుతున్నారు. కారణం.. వాళ్ల చర్మం చాలా సున్నితంగా ఉంటుందని.. అందుకే గాఢత తక్కువగా ఉండే ఉత్పత్తులనే ఎంచుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా.. తాజా పరిశోధనలు కూడా ఏడాదిలోపు వాళ్లకు సబ్బును వీలైనంత తక్కువ వాడాలని చెబుతున్నాయని అంటున్నారు. లేకుంటే వాళ్ల చర్మం పొడిబారి చర్మసమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
అలాగే చాలా మంది ఫ్యాన్సీ, రంగులు, పరిమళాలు ఉన్న సబ్బులను ఇష్టపడుతుంటారు. అవి పిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా అంత మంచిది కాదంటున్నారు. దుర్వాసన తగ్గాలనీ, మరికొన్ని చర్మ ప్రయోజనాల కోసం వీటిలో రసాయనాలు వాడతారు. ఇవి చర్మంలో సహజ నూనెలను తగ్గించి, దురదకు దారితీస్తాయి. ఇలాంటివి పిల్లలకు అసలే పడవు. వాళ్లకి చాలా మైల్డ్ ఉత్పత్తులు వాడాలని.. అందుకే సబ్బులు కాకుండా కొబ్బరి, బాదం లాంటి సహజ నూనెలు, అలోవెరా ఉండే బాడీవాష్‌లకి ప్రాధాన్యమివ్వాలని అంటున్నారు. వాటిల్లోనూ పరిమళాలు లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు.
2014లో పీడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. సువాసన లేని సబ్బును ఉపయోగించే పిల్లలలో చర్మం చికాకు, అలెర్జీ ప్రతిచర్యలు గణనీయంగా తక్కువగా ఉన్నాయని అధ్యయనం కనుగొంది. అలాగే సువాసన సబ్బును ఉపయోగించే పిల్లలలో చర్మం పొడిగా, దురదగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉందని అధ్యయనం కనుగొంది. ఈ పరిశోధనలో న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్లో డెర్మటాలజిస్ట్ డాక్టర్ జెన్నిఫర్ ఎస్. సేవెజ్ పాల్గొన్నారు.
అలాగే అమెరికన్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ తెలిపిన సమాచారం మేరకు హైపోఅలెర్జెనిక్, సువాసన లేని సబ్బులను ఉపయోగించే పిల్లలలో చర్మం చికాకుకు గురయ్యే అవకాశం తక్కువగా ఉందని కనుగొన్నారు.
పిల్లల చర్మం పెద్దవాళ్ల స్కిన్‌తో పోలిస్తే ఇంకా మృదువుగా ఉంటుంది. కాబట్టి, వాళ్ల ఉత్పత్తుల్లో పారబెన్స్, మినరల్ ఆయిల్స్, సల్ఫేట్స్ వంటివి లేకుండా పీహెచ్ 5-5.5 శాతం ఉన్నవే ఎంచుకుంటే మేలని డాక్టర్ శైలజ సూరపనేని సూచిస్తున్నారు.
పిల్లల ముందు ఈ పనులు చేస్తున్నారా? అయితే జాగ్రత్త అంటున్న నిపుణులు! - parents not to do these things
పిల్లలు చదువుపై శ్రద్ధ పెట్టడం లేదా? - పేరెంట్స్ ఇలా చేయాల్సిందే! - Best Parenting Tips For Child