Bottle Gourd Benefits For Health : శరీరానికి చల్లదనం అందించే కూరగాయలలో ప్రధానమైనది సొరకాయ. దాహాన్ని, డీహైడ్రేషన్ సమస్యను పరిష్కరించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే సొరకాయ తినటం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సొరకాయలో అధిక శాతం ఉండే నీరు మన శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. అంతే కాకుండా దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కనుక త్వరగా బరువు తగ్గడానికి ఇది ఎంతో సహకరిస్తుంది. వీటితోపాటు సొరకాయ తినటం వల్ల కలిగే వివిధ ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ తినటం వల్ల కలిగే ప్రయోజనాలు
సొరకాయ కూరగాయలలో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీనిని తీసుకుంటే, శరీరానికి చల్లదనం లభిస్తుంది. పైగా డీహైడ్రేట్ సమస్య కూడా నివారణ అవుతుంది.
బరువు పెరగకుండా
సొరకాయలో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కనుక ఇది శరీర బరువు పెరగకుండా నియంత్రిస్తుంది. అంతేకాకుండా సొరకాయలో ఉండే అధిక ఫైబర్ వల్ల కడుపునిండిన భావన కలుగుతుంది. దీని వల్ల అధికంగా తినాల్సిన అవసరం ఏర్పడదు.
జీర్ణక్రియ మెరుగుదల
సొరకాయలో ఉండే అధిక ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది. అంతే కాకుండా ఇది మలబద్ధకాన్ని నియంత్రిస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండేలా సహకరిస్తుంది.
సమృద్దిగా పోషకాలు
సొరకాయలో విటమిన్-బి,విటమిన్- సి లతో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. వీటిని తినటం వల్ల ఎముకల దృఢత్వం పెరుగతుంది. దీనితోపాటు రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. రక్తపోటును నియంత్రించడంలోనూ సొరకాయ కీలకపాత్ర పోషిస్తుంది.
డీ టాక్సీఫికేషన్
సొరకాయలోని గుణాలు శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహకరిస్తాయి. దీనిలోని అధిక నీటి శాతం వల్ల మూత్ర విసర్జన బాగా జరుగుతుంది.
గుండెకు ఎంతో మేలు
సొరకాయలోని ఫైబర్, పొటాషియం, విటమిన్-సి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అదే విధంగా పొటాషియం రక్తపోటును, విటమిన్-సి లోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా నియంత్రిస్తాయి.
చర్మ సౌందర్యానికి, కురులకు
సొరకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు, అధిక నీటి శాతం వల్ల జుట్టుకు చాలా మేలు జరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ బారి నుంచి కాపాడతాయి. ఇవండీ సొరకాయ తినటం వల్ల కలిగే ప్రయోజనాలు. అయితే కొంత మందికి వ్యక్తిగతంగా ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే డాక్టర్ను సంప్రదించి వీటిని తినటం మంచిది.
చల్లటి పాలు- ఎసిడిటీకి తిరుగులేని మందు! ఇలాంటి మరో 6 చిట్కాలు మీకోసం!