BITTER GOURD : కాకరకాయ.. ఆ పేరు వినగానే కొంత మంది 'బాబోయ్' అంటూ దూరం పెట్టేస్తారు. చేదుగా ఉంటుందని కాకరను దూరం పెట్టినా . నిజానికి అది చేసే మేలు వెలకట్టలేనిది. కాకర కాయలో ఎ, బి1, బి2, బి3, బి5, బి6, బి9, సి విటమిన్లతో పాటు పీచు, పొటాషియం, సోడియం, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, క్యాల్షియం, రైబోఫ్లావిన్, రాగి, జింక్, ఐరన్ ఖనిజాలు ఉంటాయి. కాకరకాయను ఖనిజాల గని అని కూడా చెప్పుకోవచ్చు.
- కాకర కాయలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. దాంతో జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా సహకరిస్తుంది. పైగా శరీరంలో పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. అధిక బరువు నియంత్రణకు సైతం కాకరకాయ ఉపయోగపడుతుంది.
- కాకరకాయలో సి, ఎ విటమిన్లు, ఫొలెట్, పొటాషియం, జింక్, ఇనుప ఖనిజాలు అధికంగా ఉంటాయి. ప్రధానంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్-సి అధికంగా ఉంటుంది. రక్తహీనత సమస్య రాకుండా ఎంతో సహకరిస్తుంది.
- 'ఎ' విటమిన్ భాండాగారమైన కాకర కాయ తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగు పడుతుంది. కంటి చూపు మెరుగుపడడంతో పాటు ఫొలెట్ పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.
- మధుమేహ వ్యాధి బాధితులకు కాకరకాయ ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పుకోవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్‌ని అందిస్తుంది.
- ఉదర, పేగు, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్‌లతో పోరాడే లక్షణాలు కాకరకాయలో ఉన్నట్లు పలు పరిశోధనలు వెల్లడించాయి.
ఆహారంలో భాగంగా కాకర తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగడంతో పాటు శరీరంలో చేరిన సూక్ష్మక్రిములు నశిస్తాయి. గాయాలు త్వరగా మానిపోతాయి. జుట్టు పోషణ పెరిగి కురులు దృఢంగా ఉంటాయి. కంటిచూపు మెరుగుపడడంతో పాటు చర్మానికి మెరుపు, ఎముకలు, దంతాలు పటిష్టంగా ఉంటాయి. కాకర రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండె జబ్బులను నివారిస్తుంది. ఊబకాయం రాకుండా అడ్డుపడడంతో పాటు రక్తాన్ని, కాలేయాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంది. ఉబ్బసం లాంటి శ్వాసకోశ వ్యాధులు, ఇబ్బందులు అరికట్టడంలో కాకర చేసే మేలు అంతా ఇంతా కాదు. రక్తహీనత రాకుండా కాపాడి కొన్ని రకాల క్యాన్సర్లను సైతం నివారిస్తుంది. మధుమేహ రోగులు రోజూ అర చెంచా కాకర రసం తాగితే చాలు వ్యాధి అదుపులో ఉంటుంది. అల్లం, వెల్లుల్లి, నువ్వులు, పల్లీలు, కొబ్బరి లాంటి ఆహార పదార్థాలు జోడించి కాకరకాయలతో అద్భుతాలను ఆవిష్కరించవచ్చని చెఫ్‌లు పేర్కొంటున్నారు. కూర, పచ్చడి, పులుసు, ఇగురే కాకుండా కారం, చిప్స్ చేయొచ్చని చెప్తున్నారు.
కాకరకాయలో ఎన్నో సుగుణాలున్నా అతిగా, బలవంతంగా తింటే అనర్థమే. అలా చేస్తే వాంతులు, విరేచనాల లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గర్భిణులు కాకరకాయ తినకపోవడం చాలా మంచిది. వీటిలోని మెమోచెరిన్ పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. రోజూ కాకరకాయ తినడం వల్ల కడుపు నొప్పి లేదా ఇతర సమస్యలను ఎదుర్కొంటారు. రోజూ కాకరకాయ తింటుంటే ఆ అలవాటు మానుకోవడమే మంచిది. కాకరకాయలో లెక్టీన్ కాలేయానికి హానికలిగిస్తుంది.