Bitter Gourd Bitterness Remove : కాకరకాయ అనగానే 'చేదు' అంటూ చాలా మంది ముఖం తిప్పేసుకుంటారు. ఇంట్లో కాకరకాయ కూర చేశారంటే ఆ రోజు దాన్ని తినకుండా ఉండేవారూ ఉంటారు. కానీ, చేదుగా ఉండే కాకరకాయలో ఎన్నో పోషక గుణాలు ఉంటాయి. జీర్ణక్రియ, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపర్చడానికి కాకరకాయ మేలు చేస్తుంది. అయితే, చేదుగా ఉందన్న ఒక్క కారణంతో దీన్ని తినకుండా ఉండటం సరికాదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాకరకాయ చేదు రుచిని తగ్గించుకోవడానికి టిప్స్ చెబుతున్నారు. సింపుల్ చిట్కాలు పాటించి కాకరకాయ చేదు రుచిని తగ్గించడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
గరుకు భాగాన్ని తీసేయండి
కాకరకాయ చేదును సగానికి సగం తగ్గించాలంటే ఈ సింపుల్ టిప్ పాటించండి. కాకరకాయ తోలుపై ఉండే గరుకు భాగాన్ని మొత్తం తొలిచేయాలి. బీరకాయ పొట్టు గీకేసినట్టు కాకరకాయ గరుకు భాగాన్ని తొలగించాలి. ఆ తర్వాత బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
గింజలను తొలగించండి
కాకరకాయ చేదును తగ్గించడానికి ఉన్న ఇంకో సింపుల్ మార్గం గింజలను తొలగించడం. కాకరకాయ గరుకు తోలును తీసేసిన తర్వాత గింజలను కూడా తొలగించుకుంటే చాలా వరకు చేదు తగ్గిపోతుంది.
ఉప్పు రాయండి
కాకరకాయ చేదు తగ్గించడానికి ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. వంట చేసుకోవడానికి 20- 30 నిమిషాల ముందు కాకరకాయ ముక్కలకు ఉప్పు రాసుకోవాలి. అన్ని ముక్కలకు సమానంగా ఉప్పు తగిలేలా చూసుకోవాలి. కొద్దిసేపు అలాగే ఉంచుకొని వంట చేసుకుంటే చాలు. చేదు తగ్గిపోతుంది.
ఉప్పులో నానబెట్టడం
కాకరకాయ ముక్కలకు ఉప్పు రాయడమే కాకుండా మరో మార్గంలోనూ చేదును తగ్గించుకోవచ్చు. వేడి ఉప్పు నీటిలో ముక్కలను నానబెట్టడం వల్ల కూడా కాకరకాయ చేదు తగ్గుతుంది. మరుగుతున్న నీటిలో కాస్తంత ఉప్పు వేసి అందులో ముక్కలను నానబెట్టుకోవాలి.
రసం పిండేయండి
కాకరకాయకు ఉప్పు రాసి కాసేపు ఉంచడం వల్ల ముక్కలలోని రసం బయటకు వస్తుంది. చేదు తగ్గాలంటే ఆ రసాన్ని పిండేస్తే సరిపోతుంది.
పెరుగు వాడితే ప్రయోజనం
కాకరకాయలకు పెరుగు జత చేయడం వల్ల కూడా చేదు తగ్గుతుంది. కాకరకాయ ముక్కలకు పెరుగు కోటింగ్ చేసి కనీసం గంట సేపు వదిలేయాలి. ఆ తర్వాత వంటకు వినియోగించాలి.
కాకరకాయతో లాభాలివే!
నిపుణుల ప్రకారం కాకరకాయతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. అవేంటంటే?
- కాకరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఎక్కువగా తినాలన్న భావనను ఇది దూరం చేస్తుంది. తద్వారా ఇది అధిక కేలరీలు ఉండే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండే వీలు కలుగుతుంది.
- కాకరకాయలోని ఫైబర్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో మలబద్ధకం, హెమోరాయిడ్స్ సమస్య రాకుండా చూస్తుంది.
- కాకరకాయలో క్యారెంటీన్ అనే పదార్థం ఉంటుంది. గర్భం దాల్చిన సమయంలో మహిళల్లో మధుమేహం సమస్యలను ఇది దూరం చేస్తుంది.
- మహిళల్లో పిండం అభివృద్ధికి అవసరమయ్యే జింక్, ఫోలేట్, ఐరన్, పొటాషియం సహా ఇతర మినరల్స్ కాకరకాయలో సమృద్ధిగా లభిస్తాయి.
మీ కోసం వ్యాయామమే దిగి వచ్చింది - జస్ట్ 22 నిమిషాలు చేసినా చాలట!