Best Ways To Avoid Hunger Habit : సహజంగా మనకు ఆకలి అవుతోందంటే.. శరీరానికి శక్తి కావాలని అర్థం. అప్పుడు మనం ఏదో ఒక ఆహారాన్ని శరీరానికి అందిస్తుంటాం. కానీ.. చాలా మంది ఆకలి లేకున్నా తింటుంటారు. మరి.. ఆకలి(Hunger) లేకున్నా ఎందుకు తినాలనిపిస్తుంది? అందుకు కారణాలేంటి? దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? ఈ అలవాటును మానుకోవాలంటే ఏం చేయాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆకలి లేనప్పుడు ఎందుకు తినాలనిపిస్తుందంటే?: ఆకలి లేనప్పుడు తినాలనిపించే సమస్య వెనక అనేక కారణాలు ఉంటాయని న్యూట్రిషనిస్ట్ దీప్తి ఖతుజా చెబుతున్నారు. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే..
- సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ తలెత్తవచ్చని చెబుతున్నారు. కొంతమంది ఏదో ఒకటి తినాలనే ఉద్దేశంతో అసంపూర్తిగా ఉండే ఆహారాన్ని తీసుకుంటుంటారు. ఇది కూడా ఆకలి లేనప్పుడు తినడానికి కారణం కావొచ్చంటున్నారు.
- అలాగే.. ప్రతి 2-3 గంటల మధ్య అల్పాహారం తీసుకోవాలనే అలవాటు.. అంటే రాత్రి భోజం తర్వాత స్నాక్స్ తినడం వంటివి ఈ సమస్యకు దారితీయవచ్చంటున్నారు. అదేవిధంగా చక్కెర ఉండే తీపి పదార్ధాలు తినడం వల్ల కూడా ఆకలి కలుగుతుందని వైద్యులు వివరిస్తున్నారు.
- మరికొందరిలో ఒత్తిడి, మానసిక ఆందోళన, ఒంటరితనం, ప్రతికూల ఆలోచనలు.. వంటివన్నీ ఆకలి భావాలను కలిగిస్తాయని చెబుతున్నారు.
- ఒత్తిడి లేదా భావోద్వేగానికి గురైనప్పుడు గ్రెలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఆకలి, దప్పికలకు, ఎక్కువ తినడానికి దారితీస్తుందంటున్నారు.
ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటే?
- ఆకలి లేకపోయినా తినడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. దీనివల్ల శరీరంలో అదనపు క్యాలరీలు చేరి బరువు పెరగడానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.
- అధిక బరువు లేదా ఊబకాయం కారణంగా.. హైపర్‌టెన్షన్, మధుమేహం, కార్డియోవాస్కులర్ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు.
- వీటితో పాటు పలు మానసిక సమస్యలకూ దారి తీస్తుందంటున్నారు దీప్తి ఖతుజా.
- 2018లో 'International Journal of Obesity'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ఆకలితో లేనప్పుడు తినడం వల్ల బరువు పెరగడం, ఊబకాయం ప్రమాదం పెరుగుతుందట.
అలర్ట్- ఫాస్ట్‌గా భోజనం తింటున్నారా? అయితే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు!
ఆకలి లేనప్పుడు తినడాన్ని తగ్గించుకోండిలా..
- మొదట మీరు చేయాల్సిన భోజన వేళల్లో కాకుండా ఇంకెప్పుడైనా తినాలనిపిస్తే అది నిజమైన ఆకలో కాదో ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలి.
- ముఖ్యంగా స్వీట్లు, స్నాక్స్ తినాలనుకున్నపుడు మీకు నిజంగానే ఆకలి వేస్తోందా లేదా అని మీకు మీరే ప్రశ్నించుకోవాలని సూచిస్తున్నారు.
- మీ డైలీ డైట్లో సరైన పోషకాహారం ఉండేలా ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా ప్రొటీన్, ఫైబర్ కంటెంట్ తగినంతగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే.. అవి మీకు ఎక్కువసేపు కడుపునిండిన భావన కలిగిస్తాయంటున్నారు.
- రెగ్యులర్‌గా వ్యాయామం, ధ్యానం, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడం అలవాటు చేసుకోవాలి. ఇవి ఒత్తిడి, భావోద్వేగాలను కంట్రోల్లో ఉంచడానికి సహాయపడతాయని.. తద్వారా ఎక్కువగా తినాలనే కోరికనూ తగిస్తాయంటున్నారు.
- హైడ్రేట్‌గా ఉండటానికి తగినంత నీరు తాగాలి. కొన్నిసార్లు శరీరంలో నీరు తక్కువైనప్పుడూ ఆకలి భావన కలుగుతుందట. కాబట్టి.. ఆకలి అనిపిస్తే ముందుగా మంచినీళ్లు తాగాలని సూచిస్తున్నారు.
- బోర్ ఫీలింగ్ ఉన్నప్పుడు కూడా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఆ సమయంలో వెంటనే మైండ్ డైవర్ట్ చేసుకోవాలని చెబుతున్నారు. స్నానం చేసి రావడం, ఫేస్‌మాస్క్ ప్రయత్నించడం, సంగీతం వినడం.. వంటివి చేస్తే ఆహారం సంగతి మర్చిపోతారని చెబుతున్నారు నిపుణులు. ఇవన్నీ ఒక్క రోజులో అలవాటు కావని.. క్రమంగా అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అల్సర్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఏం తినాలో? ఏం తినకూడదో తెలుసుకోండి! - Stomach Ulcer Diet