How To Prevent Premature Baldness in Mens : నేటి యువతను బట్టతల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీని కారణంగా ఎంతో మంది మానసికంగా కుంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. బట్టతల వచ్చాక బాధపడే కంటే.. అది రాక ముందే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిదంటున్నారు. జుట్టు రాలడం, బట్టతల(Baldness) వంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడంతో పాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఒత్తిడి : ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపడమే కాకుండా.. జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా దీర్ఘకాలిక ఒత్తిడి టెలోజెన్ ఎఫ్లువియం అనే పరిస్థితిని ప్రేరేపిస్తుంది. దీని కారణంగా జుట్టు అధికంగా రాలుతుందని చెబుతున్నారు. కాబట్టి, అలాకాకుండా ఉండాలంటే ఒత్తిడిని కంట్రోల్లో ఉంచుకునేలా చూసుకోవాలంటున్నారు. ఇందుకోసం యోగా, ధ్యానం చేయడం వంటివి అలవాటు చేసుకోవాలంటున్నారు.
2009లో 'Archives of Dermatology' అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ఎక్కువ ఒత్తిడికి గురైన పురుషులకు.. తక్కువ ఒత్తిడికి గురైన పురుషుల కంటే బట్టతల రావడం 2.6 రెట్లు ఎక్కువ అని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ బ్రెండా ఫిషర్ పాల్గొన్నారు. ఎక్కువ ఒత్తిడికి గురయ్యే వారిలో జుట్టు రాలే సమస్య అధికంగా ఉండి బట్టతల వచ్చే ఛాన్స్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
జీవనశైలిలో మార్పులు : బట్టతలకు రావడానికి జీవనశైలిలో వచ్చిన మార్పులు కూడా ప్రధాన కారణమని చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. అందుకే.. ఈ పరిస్థితిని ఎదుర్కోకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం, ధూమపానానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలా ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం ద్వారా బట్టతల రావడాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
హార్మోన్ సమస్యలు రాకుండా చూసుకోండి : హార్మోన్ల అసమతుల్యత కారణంగానూ పురుషులలో బట్టతల వస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మగవారిలో అధిక స్థాయిలో ఉండే టెస్టోస్టెరాన్ హార్మోన్.. 5-ఆల్ఫా రిడక్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా డైహైడ్రోటెస్టోస్టెరాన్(DHT)గా మారుతుంది. ఈ హార్మోన్ అనేది జుట్టు కుదుళ్లపై ప్రభావం చూపి హెయిర్ లాస్‌కు కారణమవుతుందని చెబుతున్నారు. కాబట్టి, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడకుండా చూసుకోవాలని చెబుతున్నారు.
వీటి బారిన పడకుండా చూసుకోవాలి : పురుషులలో బట్టతలకు కొన్ని వైద్య పరిస్థితులు, చికిత్సలు దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అలోపేసియా ఏరియాటా, థైరాయిడ్ రుగ్మతలు వంటివి జుట్టు రాలడానికి కారణమవుతాయంటున్నారు. అలాగే.. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సలు తాత్కాలిక లేదా శాశ్వత బట్టతలకు దారితీసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు. కాబట్టి ఈ సమస్యల బారిన పడకుండా చూసుకోవాలని చెబుతున్నారు.
- కొందరికి వంశపారంపర్యంగా బట్టతల వస్తుంది. మీ వంశంలో కూడా బట్టతల ఉంటే.. దాన్ని ఆపడం దాదాపుగా కష్టం. అయితే, అలాంటి వారు పైన చెప్పిన వాటితో పాటు ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా బట్టతలను కొంతమేర అడ్డుకోవచ్చంటున్నారు నిపుణులు.
- జుట్టుపై ఎక్కువ ఒత్తిడిని కలిగించే హెయిర్‌స్టైల్స్ ఫాలో అవ్వడం మానుకోవాలి. తలకు రెగ్యులర్ మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీని వల్ల కూడా బట్టతల ఆలస్యం అవుతుందంటున్నారు.
- మీ డైట్‌లో ప్రొటీన్ లోపించకుండా చూసుకోవాలి. నట్స్, చీజ్, చేపలు, గుడ్లు, మాంసం, చికెన్ వంటి ప్రొటీన్-రిచ్ ఫుడ్స్ తీసుకునేలా చూసుకోవాలంటున్నారు.
- ఇన్ని జాగ్రత్తలు, చర్యలు తీసుకున్నప్పటికీ జుట్టు రాలడం తగ్గకపోతే.. మీరు వైద్యుడిని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
తలస్నానం చేసినా కూడా జుట్టు జిడ్డు వదలట్లేదా? - ఈ టిప్స్‌తో కురులు మెరిసిపోతాయి!