Best Foods to Eat Before Drinking Alcohol : 'మద్యపానం ఆరోగ్యానికి హానికరం' అని తెలిసినా.. రోజూ ఆల్కాహాల్ సేవించే వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. అయితే.. మద్యపానం వల్ల దీర్ఘకాలంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతలో కొంత నష్టాన్ని నివారించేందుకు హెల్దీ ఫుడ్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ.. ఆ ఆహార పదార్థాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సాల్మన్ ఫిష్ : మద్యం తాగడానికి ముందు సాల్మన్ చేప తీసుకోవడం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాల్మన్ చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడులో మంటతోపాటు ఆల్కహాల్ కలిగించే హానికరమైన ప్రభావాలను నివారించడంలో సహాయపడుతుందట. అలాగే ఈ చేపలో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరం త్వరగా ఆల్కహాల్‌ను గ్రహించకుండా నిరోధించడంలోనూ ఉపయోగపడుతుంది.
గుడ్లు : ఉడికించిన గుడ్లలో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అవి జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దాంతో ఆల్కహాల్‌ను దేహం తీసుకోవడం ఆలస్యం అవుతుంది. కాబట్టి మద్యం తాగడానికి ముందు బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. 2000 సంవత్సరంలో నిర్వహించిన "ది ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ ఆన్ ది ఆబ్సార్ప్షన్ ఆఫ్ ఆల్కహాల్" అనే అధ్యయనం ప్రకారం.. మద్యం తాగడానికి ముందు గుడ్లు తినడం వల్ల ఆల్కహాల్ శోషణను 15% వరకు తగ్గిస్తుందని కనుగొన్నారు.
అరటిపండ్లు : మద్యం తాగడానికి ముందు అరటిపండ్లు తినడం కూడా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఇవి ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను నివారిస్తాయి. మద్యం సేవించడం వల్ల బాడీలోని వాటర్ లెవల్స్ తగ్గడమే కాకుండా డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఇది జరగకుండా నిరోధించడంలో అరటిపండ్లు చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు.
ఓట్స్ : ఆల్కహాల్ తీసుకోవడానికి ముందు ఓట్స్ తిన్నా ఆరోగ్యానికి మేలు జరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియం, సెలీనియం, ఇనుముతో నిండి ఉంటాయి ఓట్స్. మద్యం తాగడానికి ముందు వీటిని తినడం వల్ల మందు కాలేయాన్ని ప్రభావితం చేయకుండా నిరోధించడమే కాకుండా దాని పనితీరును మెరుగుపరుస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది.
'మద్యం తాగుతున్నారా? అయితే త్వరగా ముసలివారు అయిపోతారు'
చిలగడదుంపలు : వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇవి బాడీలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. కాబట్టి మద్యం సేవించడానికి ముందు చిలగడదుంపలు తినడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
చియా పుడ్డింగ్ : చియా సీడ్స్‌లో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం వంటి సూక్ష్మపోషకాలతో పాటు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి సెల్ డ్యామేజ్‌ను నివారించడంలో, కాలేయాన్ని రక్షించడంలో చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి ఆల్కహాల్ తాగడానికి చియా సీడ్స్ పుడ్డింగ్ తీసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
అవకాడో : ఇందులో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి.. ఆల్కహాల్ తాగే ముందు అవకాడోలు తినడం చాలా మంచిదంటున్నారు. ఎందుకంటే ప్రొటీన్ లేదా పిండి పదార్ధాల కంటే కొవ్వు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని ఫలితంగా మీ రక్తప్రవాహంలోకి ఆల్కహాల్ శోషణ మందగిస్తుందని చెబుతున్నారు.
ఇవేకాకుండా మద్యం సేవించడానికి ముందు.. బెర్రీలు, పెరుగు, ద్రాక్షపండ్లు, క్వినోవా, పుచ్చకాయ, బీట్రూట్ వంటివి తినడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి కూడా ఆల్కహాల్ శరీరంపై కలిగించే హానికరమైన ప్రభావాలను చాలా వరకు తగ్గిస్తాయని అంటున్నారు.
NOTE : మద్యం తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. మానుకోవడమే శ్రేయస్కరం