Bottle Gourd Health Benefits: అధిక బరువు.. ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇదీ ఒకటి. అయితే బరువును తగ్గించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాకాకుండా మీ డైలీ డైట్లో సొరకాయను చేర్చుకుంటే.. ఈజీగా బరువు(Weight) తగ్గడానికి తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. అందుకు ప్రధాన కారణం దీనిలో ఉండే పోషకాలేనట! ఇంతకీ, సొరకాయలో ఉన్న పోషకాలేంటి? అవి బరువు తగ్గడానికి ఏవిధంగా తోడ్పడతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పోషకాల స్టోర్ హౌజ్ : సొరకాయనే 'కాలాబాష్' అని కూడా పిలుస్తారు. భారతీయ, ఆగ్నేయాసియా వంటకాలలో సాధారణంగా ఉపయోగించే ఈ కూరగాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు బి, సి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, డైటరీ ఫైబర్‌తో పాటు మరికొన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా సొరకాయను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకుంటున్న వారికి ఇది మంచి ఆహార ఎంపికగా చెప్పుకోవచ్చంటున్నారు.
తక్కువ కేలరీలు, అధిక నీటి కంటెంట్ : సొరకాయ బరువు తగ్గడానికి ఎఫెక్టివ్‌గా చేస్తుందని చెప్పడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. తక్కువ కేలరీలు, అధిక నీటి కంటెంట్ కలిగి ఉండడం. కేవలం వంద గ్రాముల కాయ నుంచి శరీరానికి అందేవి 15 క్యాలరీలే. నీరు మాత్రం 96శాతం ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సొరకాయను తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.
డైటరీ ఫైబర్ పుష్కలం : బరువు తగ్గడానికి డైటరీ ఫైబర్ చాలా అవసరం. ఇది సొరకాయలో పుష్కలంగా దొరుకుతుంది. ఇది అతిగా తినే అలవాటుని తగ్గిస్తుంది. శరీర బరువుని అదుపులో ఉంచుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు దీన్ని నిరభ్యంతరంగా తినేయొచ్చంటున్నారు నిపుణులు.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ : తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు బరువు తగ్గడానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా నిర్వహించడానికి, ఆకలిని తగ్గించడానికి, అతిగా తినడాన్ని నిరోధించడంలో చాలా బాగా సహాయపడతాయి. అలాంటి ఆహారాల్లో సొరకాయ(Bottle Gourd) ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహార ఎంపికగా చెప్పుకోవచ్చంటున్నారు.
కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది : సొరకాయను డైలీ డైట్ భాగం చేసుకున్నా లేదా జ్యూస్ రూపంలో తీసుకున్నా అందులోని పోషకాలు శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును(National Library of Medicine రిపోర్టు) తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి. ఫలితంగా బరువు తగ్గడానికి ఇది తోడ్పడుతుందంటున్నారు నిపుణులు.
2020లో "జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. డైలీ సొరకాయ జ్యూస్ తీసుకోవడం బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హర్యానాలోని గురు జంభేశ్వర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన డాక్టర్ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.
మంచి డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది : సొరకాయలోని గుణాలు శరీరంలోని విష పదార్థాలు, టాక్సిన్లను బయటకు పంపడంలో చాలా బాగా సహకరిస్తాయి. ముఖ్యంగా దీనిలోని అధిక నీటి శాతం వల్ల మూత్ర విసర్జన బాగా జరుగుతుంది. అలాగే దీనిలోని అధిక ఫైబర్ జీర్ణప్రక్రియ సాఫీగా జరిగేలా చూస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఫలితంగా మొత్తం జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి.. సొరకాయను డైలీ డైట్లో చేర్చుకోవడం బరువు తగ్గడానికి అన్నివిధాలా చాలా బాగా సహకరిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
40 ఏళ్లు దాటాక బరువు తగ్గాలా? - ఇలా చేస్తే సింపుల్‌గా వెయిట్ లాస్!
బరువు తగ్గాలా? - మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ డ్రై ఫ్రూట్స్ చేర్చుకుంటే బెస్ట్ రిజల్ట్!