Children Cough Home Remedy : చిన్న పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా తల్లిదండ్రులు తట్టుకోలేరు. జ్వరంతోపాటు దగ్గు, జలుబు వచ్చాయంటే.. వారికి నిద్ర కూడా సరిగ్గా ఉండదు. పోనీ మందులు వేద్దామన్నా.. కొందరు పిల్లలు చేదుగా ఉన్నాయంటూ సరిగా తీసుకోరు. ఇలాంటి వారి కోసం ఆయుర్వేదంలో తియ్యగా ఓ ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. మరి ఈ ఔషధం తయారు చేసుకోవడానికి అవసరమైన పదార్థాలు ఏంటి? వీటి వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? అసలు ఈ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి? అనే ప్రశ్నలకు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవి ఇచ్చిన సమాధానాలను ఈ స్టోరీలో చూద్దాం.
దగ్గు ఔషధం తయారీకి కావాల్సిన పదార్థాలు..
- 25 గ్రాముల చందనం
- 25 గ్రాములు ఎండు ద్రాక్ష
- 25 గ్రాముల ఉసిరి (ఎండబెట్టినది)
- 25 గ్రాముల తేనె
- 25 గ్రాముల చక్కెర
తయారీ విధానం..
- ముందుగా ఓ చిన్న గిన్నెను తీసుకుని అందులో 25 గ్రాములు పరిమాణంలో చందనం, చక్కెర, తేనె, ఎండు ద్రాక్ష వేసుకోవాలి.
- అనంతరం ఎండబెట్టిన ఉసిరిని చూర్ణం చేసుకుని అందులో వేసుకోవాలి.
- ఆ తర్వాత వీటన్నింటినీ ఒక లేహ్యంలా తయారయ్యే వరకు బాగా కలుపుకోవాలి. అంతే.. నేచురల్ దగ్గు మందు తయారైపోతుంది.
- ఈ మిశ్రమం చిన్న పిల్లలకు మంచి ఔషధంలా పనిచేస్తుంది.
- ఈ మిశ్రమాన్ని వీలైనంత వరకు గాజు పాత్రలో నిల్వ ఉంచడం మంచిది. సుమారు నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.
- చిన్నపిల్లలకు దగ్గు ఉన్న సమయంలో.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. మూడు పూటలు చిన్న చెంచాడు ఔషధాన్ని ఇవ్వాలని గాయత్రీ దేవి సూచిస్తున్నారు.
ఎండు ద్రాక్ష ఎంతో మేలు..
చిన్న పిల్లల్లో దగ్గు తగ్గించేందుకు ఉపయోగపడే ఈ ఔషధంలో ఎండు ద్రాక్ష ప్రధానమైనది. ఎండు ద్రాక్షలో దగ్గును తగ్గించేవి మాత్రమే కాకుండా పిల్లలకు శక్తినిచ్చే రసాయనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
చందనం ఇలా కూడా..
గొంతులో ఉండే కఫం తగ్గించడంలో చందనం ఎంతో ఉపయోగపడుతుంది. మామూలుగా చలువ చేస్తుందని చందనాన్ని వాడుతుంటారు. ఇదే కాకుండా దగ్గు తగ్గడంలోనూ చందనం ఎంతో సహకారం అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఉసిరి అద్భుతం..
దగ్గును తగ్గించడంలో ఉసిరి ఎంతో సహాయం చేస్తుంది. ఇదే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉసిరిలో ఉన్నాయని అంటున్నారు.
తేనె దివ్యఔషధం..
దగ్గుకు ప్రధాన విరుగుడుగా తేనె అని భావిస్తుంటారు. సాధారణంగా కొందరు కొంచెం దగ్గు ఉన్నా తేనెను సేవిస్తుంటారు. తేనె కఫాన్ని తగ్గించే మంచి ఔషధమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మన శరీరంలో ఐరన్ లోపం ఉంటే - ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయో మీకు తెలుసా? - Iron Deficiency Symptoms