Eating Fish Daily Benefits and Risks : నాన్‌వెజ్ ప్రియులు చికెన్, మటన్‌తో పాటు చేపలు కూడా ఎక్కువగా తింటుంటారు. అలాగే.. చేపల్లో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. అయితే కొద్దిమందికి వారానికి రెండు సార్లు ఫిష్ తినే అలవాటు ఉంటే.. మరికొంతమంది డైలీ చేపలను(Fish) తింటుంటారు. మరి మీకు కూడా రోజూ చేపలను తినే అలవాటు ఉందా? అయితే, రోజూ చేపలు తింటే శరీరంలో ఏం జరుగుతుంది? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పోషకాలు పుష్కలం : చేపలు తినడం వల్ల ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, మినరల్స్ వంటివన్నీ పొందవచ్చని నిపుణులు అంటున్నారు. అలాగే.. అమైనో యాసిడ్స్, ఫాస్పరస్, కాల్షియం, ఐరన్ వంటివి చేపలలో ఉంటాయని.. ఇవేకాకుండా.. చేపలలో ఆరోగ్యానికీ మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయంటున్నారు నిపుణులు. మరి ప్రతిరోజూ చేపలు తింటే ఏం జరుగుతుందంటే..
గుండె ఆరోగ్యానికి మేలు : ముఖ్యంగా సాల్మన్, ట్యూనా, మాకేరెల్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ప్రధానంగా ఈ చేపలలో EPA(eicosapentaenoic acid), DHA(docosahexaenoic acid) పుష్కలంగా ఉంటాయట. ఈ కొవ్వులు మంటను తగ్గించడం, చెడు కొలెస్ట్రాల్ (LDL)ని తగ్గించడం, రక్తనాళాల పనితీరును మెరుగుపరచడం ద్వారా గుండెను ఆరోగ్యవంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ సోనియా బక్షి తెలిపారు. ముఖ్యంగా.. గుండె జబ్బులు, స్ట్రోక్, అరిథ్మియా ప్రమాదాన్ని తగ్గిస్తుందంటున్నారు.
2002లో NEJM (New England Journal of Medicine)లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. చేపలు ఎక్కువగా తినే వ్యక్తులకు గుండె జబ్బులు రావడం తక్కువని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ ఎరిక్ రిమ్ పాల్గొన్నారు. చేపలను ఎక్కువగా తినడం వల్ల అందులోని పోషకాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
మెదడు పనితీరు మెరుగుపడుతుంది : చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు పనితీరులో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. అలాగే.. ఇవి జ్ఞాపకశక్తి, దృష్టిని మెరుగుపరచడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాదు.. రోజూ చేపలు తినడం వల్ల వయసు-సంబంధిత అభిజ్ఞా క్షీణత, అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల నుంచి కొంత రక్షణ లభిస్తుందని చెబుతున్నారు.
చేపలు వండినప్పుడు నీచు వాసన వస్తోందా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే!
ఎముకలు బలంగా తయారవుతాయి : సాల్మన్, ట్యూనా, సార్డిన్స్.. వంటి కొన్ని రకాల చేపలలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఫలితంగా రోజూ చేపలు తినే వారి ఎముకలు స్ట్రాంగ్‌గా తయారవుతాయంటున్నారు. ఎందుకంటే.. ఎముకల ఆరోగ్యానికి కాల్షియం చాలా అవసరం.
కంటిచూపు మెరుగుపడుతుంది : చాలా రకాల చేపలలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, వీటిని డైలీ తినడం వల్ల కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇది ఆరోగ్యకరమైన దృష్టికి, కార్నియాను హెల్దీగా ఉంచడంలో చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు. అంతేకాదు.. విటమిన్ ఎ కండరాల పనితీరును మెరుగుపరచడంలో, అలసటను తగ్గించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది : చేపలలో లీన్ ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కణజాలాలను నిర్మించడానికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అలాగే.. కొన్ని రకాల చేపలు ముఖ్యమైన B విటమిన్లను కూడా అందిస్తాయని.. ఇవి జీవక్రియ, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపర్చడంలో సహాయపడతాయని చెబుతున్నారు. అదేవిధంగా.. కొన్ని రకాల చేపల్లో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంపొందించడంలో చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.
అయితే.. చేపలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా కింగ్ మాకెరెల్, స్వోర్డ్ ఫిష్ , టైల్ ఫిష్ వంటి కొన్ని రకాల చేపలలో పాదరసం అధిక స్థాయిలో ఉంటుందని.. ఫలితంగా వాటిని తినడం వల్ల.. నాడీ వ్యవస్థ సమస్యలు, పిల్లలలో అభివృద్ధి సమస్యలు, అభిజ్ఞా క్షీణతకు కారణమవుతుందంటున్నారు నిపుణులు. అలాగే.. కొంతమందిలో చేపలు తినడం అలర్జీ ప్రతిచర్యలకు దారితీయవచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి, మీకు అలర్జీ సంబంధిత సమస్యలు ఉంటే ముందుగా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది అంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
నాన్‌వెజ్ తింటే కొలెస్ట్రాల్ - తినకుండా ఉండలేం ఎలా బ్రో? - ఇవి లాగించండి బ్రో!