Avoid These Comments during Arguments: పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటారు. జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్ధం. కానీ, ప్రస్తుత కాలంలో మూడు ముళ్ల బంధం మున్నాళ్ల ముచ్చటగా మారుతోంది. చిన్న చిన్న మనస్పర్థలకే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి విడాకులు తీసుకుంటున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. వాస్తవానికి వివాహబంధం(Marriage)లో దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు కామన్. ఆ సమయంలో చాలా మంది చేసే తప్పు.. కోపంలో ఏవేవో మాటలు అనడం. అందులో చాలా వరకూ అనకూడని మాటలు ఉంటాయి. దీంతో గొడవ పెద్దగా మారి బంధానికి బీటలు వారొచ్చు. కాబట్టి దాంపత్య బంధం నిండు నూరేళ్లు సాఫీగా సాగిపోవాలంటే దంపతుల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఈ మాటలు అనకుండా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
ఇతరులతో పోల్చుతూ మాటలు అనొద్దు : భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినప్పుడు చాలా మంది చేసే మొదటి తప్పు.. ఇతరులతో పోల్చుతూ సూటిపోటీ మాటలు అనడం. అలా అనడం ద్వారా మీ బంధం బలహీనపడే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే అలాంటి మాటలు అనడం వారు అవమానంగా భావించొచ్చు. తద్వారా ఈర్ష్య, ద్వేషం, అనేక రకాల భావోద్వేగాలను ప్రేరేపించొచ్చు. కాబట్టి గొడవలు వచ్చినప్పుడు అది పురుషుడైనా లేదా స్త్రీ అయినా తమ పార్ట్నర్ను ఎప్పుడూ ఇతరులతో పోల్చకుండా చూసుకోవాలి.
మానసిక ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడొద్దు : చాలా మంది దంపతులు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కోపంలో పార్ట్నర్ను ఏవేవో మాటలంటారు. అందులో ముఖ్యంగా భాగస్వామి ఆరోగ్యం గురించి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దాని గురించి ప్రస్తావిస్తారు. అయితే అలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఏ బంధమైన నిలబడాలంటే నమ్మకం ముఖ్యం. మీ పార్టనర్ మీపై పూర్తి విశ్వాసంతో తాను ఫలాన మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు చెబుతారు. అయితే మీరు దానిని ఆసరాగా తీసుకుని గొడవ పడినప్పుడు ఆ సమస్యను పదే పదే ఎత్తిచూపితే మీపై నమ్మకం పోవడమే కాకుండా వారు లోలోపల మరింత ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.
కుటుంబ సభ్యులను అగౌరవపర్చడం : దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు ఎక్కువమంది పార్ట్నర్స్ చేసే మరో తప్పు.. కుటుంబ సభ్యులను గౌరవించకుండా మాట్లాడడం. చిన్న ప్రాబ్లమ్ వచ్చినా చాలా మంది పార్ట్నర్ దగ్గర కుటుంబసభ్యులపై నోరు పారేసుకుంటారు. దీని కారణంగా చిన్న సమస్య కాస్త పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది. అది ఒక్కోసారి వివాహా బంధం విడిపోయే వరకు దారితీస్తుంది. కాబట్టి దంపతుల మధ్య ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు వీలైనంత వరకు కుటుంబ సభ్యులను లాగకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు.
సంపాదన సామర్థ్యాలపై మాటలు అనుకోవద్దు : ఇక చివరగా మీ బంధం బలంగా ఉండాలంటే మీకు, మీ పార్ట్నర్కు మధ్య ఏవైనా చిన్న చిన్న వివాదాలు వచ్చినప్పుడు సంపాదన సామర్థ్యాల గురించి దూషించుకోవద్దు. చాలా మంది ఈ విషయంలో ఎదుటివారితో పోల్చుతారు. ఇక కొందరైతే "నాకంటే నువ్వు తక్కువ సంపాదిస్తున్నావు.. నన్నే తిడతావా" అని కోపంతో రగిలిపోయి ఒక్కోసారి చేయి కూడా చేసుకుంటారు. ఫలితంగా చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారే అవకాశం ఉంటుంది. అందుకే మీ రిలేషన్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సంపాదనకు సంబంధించి మాటలు అనకపోవడం మంచిది అంటున్నారు మానసిక నిపుణులు.
పెళ్లైన తర్వాత ఇబ్బందులు రాకుండా.. ముందే ఇవన్నీ ఆలోచిస్తున్నారా?
ప్రేమ, డేటింగ్ గురించి మీ పిల్లలకు ఈ విషయాలు చెబుతున్నారా..?