Vijay Sethupathi Maharaja Movie : పాత్ర ఎటుంవంటిదైనా అందులో జీవించి అందరినీ ఆకట్టుకుంటారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. తన విలక్షణ నటనతో తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీలోనూ ఎన్నో హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. స్క్రీన్‌పైనే కాకుండా ఆఫ్‌స్క్రీన్‌లోనూ తన క్యారెక్టర్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్‌లోనూ తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పిస్తుంటారు.
ఇలా పాన్ ఇండియా లెవెల్లో పాపులరైన ఈ స్టార్ ఇటీవలే 'మహారాజ' అనే సినిమాలో స్ట్రాంగ్ రోల్లో చేశారు. నితిలన్ స్వామినాథన్ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం జూన్ 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి విలేకర్లతో ముచ్చటించారు. సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
ప్రత్యేకంగా ఇది నా 50వ సినిమాగా ఉండాలని ఎంచుకుని మరీ చేశాను. స్టోరీ విన్నంతసేపు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కథ కంటే ఇందులోని కథనం నన్నెంతగానో ఆకట్టుకుంది. మరికొంత సేపటికి నాకు 'పిజ్జా' సినిమాని గుర్తు చేసింది. అలాంటి ట్విస్ట్‌లు ఉన్నాయ్ ఈ మూవీలో. డైరెక్టర్ ఈ కథ చెప్పిన వెంటనే నేను ఇదే నా 50వ సినిమా అని అనౌన్స్ చేశాను.
ఇప్పటివరకు నావి సినిమాలు 50 మాత్రమే రిలీజయ్యుండచ్చు. కానీ నేను నా కెరీర్లో ఇప్పటివరకు 500 కంటే ఎక్కువ స్టోరీలను విన్నాను. ఈ జర్నీలో ఎంతో మందిని కలిశాను. విజయ, పరాజయాలను చూశాను. ప్రతి ఫలితం తర్వాత ఏం జరిగిందో అని ఆలోచిస్తాం కదా. అలాగే ఎంతో అనుభవాన్ని సంపాదించాను. ఇదొక గొప్ప ప్రయాణం.
గతాన్ని మోసుకుంటూ ముందుకు సాగడం నాకు నచ్చదు. ఇదివరకటిలాగే ఇకపై కూడా నా కెరీర్ కొనసాగుతుంది. కలలు, అంచనాలు ఎప్పుడూ భారంగానే ఉంటాయి. అందుకే రోజూ కెమెరా ముందుకు కొత్తగా వెళ్తాను. సినిమా విషయంలో అదే రకమైన థ్రిల్‌తో ఉంటాను. ఇకపైనా ఇంతే బాధ్యతతో పనిచేయడమే నా ఫ్యూచర్ ప్లాన్.
ఈ మూవీ రొటీన్ కమర్షియల్ సినిమాల్లా ఉండదు. అలాగని ఇది ఆర్ట్ సినిమా కాదు. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఓ వ్యక్తి ఏం చేశాడు? ఎంత దూరం వెళ్లాడనేది ఈ చిత్రంలో ఆసక్తికరమైన అంశం. డైరెక్టర్ నితిలన్ ఇందులోని పాత్రలను ఎంతో బలంగా మలిచారు. నిర్మాత సుధన్‌తో ఇది నా మూడో చిత్రం. అజనీష్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
మంచి కథ కుదిరితే తప్పకుండా డైరెక్షన్ వైపు వస్తాను. ఇప్పటి వరకు మూడు సినిమాలకు స్టోరీ, స్క్రీన్‌ప్లే రాశాను. మరికొన్ని కథలను కూడా రాసుకున్నాను. హీరోగా ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలకు సైన్ చేశాను. హిందీలోనూ ఓ సినిమా చేస్తున్నాను.
'మేకర్స్ ఊహలకు ఆయన రూపమిచ్చారు'- రామోజీ మృతి పట్ల విజయ్ సేతుపతి సంతాపం