Venkatesh Daughter Engagement : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ రెండో కుమార్తె హయవాహిని వివాహ వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా మెహందీ వేడుకలకు ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్, కుమార్తె సితార కూడా మెహందీలో పాల్గొన్నారు. కొత్త జంటతో ఫొటోలు తీసుకున్నారు. ప్రస్తుతం అవి నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.
ఇక ఈ పెళ్లి వేడుక కూడా అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరగనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో ఈ వివాహానికి వేదిక కానున్నట్లు సమాచారం. గతంలోనూ ఈ జంట నిశ్చితార్థం ఎంతో సైలంట్‌గా జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుమారుడితో వెంకటేశ్ స్వగృహంలోనే ఈ వేడుకను నిర్వహించారు. ఆ వేడుకకు కూడా కొంతమంది ప్రముఖలు వచ్చి కొత్త జంటను ఆశీర్వదించారు.
వెంకటేశ్, నీరజ దంపతులకు నలుగురు పిల్లలు. ఆశ్రిత, హయవాహిని, భావనతో పాటు కుమారుడు అర్జున్ ఉన్నారు. పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం 2019లో జరిగింది. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉంటున్నారు. 'ఇన్ఫినిటీ ప్లాటర్' అనే పేరుతో ఫుడ్‌కు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుంటారు.
Venkatesh Upcoming Movies : ఇక వెంకటేశ్ ఇటీవలే 'సైంధవ్' సినిమాతో ఆడియెన్స్‌ను పలకరించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే భారీ అంచనాల నడుమ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన ఎటువంటి మూవీస్‌కు సైన్ చేసినట్లు ప్రకటించలేదు.
అయితే మూవీస్‌లో అలరించే వెంకటేశ్ గతేడాది రానా నాయుడు అనే వెబ్‌సిరీస్‌లో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తన నటనతో ఫ్యామిలీ స్టార్ అనిపించుకున్న వెంకీ, ఈ సిరీస్‌లో తనలోని కొత్త కోణాన్ని చూపించారు. గతంలోనే నెట్‌ఫ్లిక్స్ సంస్థ దీనికి సీక్వెల్ రానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నట్లు సినీ వర్గాల టాక్.
సంక్రాంతి బరిలో వెంకీ మామ - ఇప్పటి వరకు ఎన్ని హిట్లు కొట్టారంటే?