Tollywood Upcoming Releases: ఫేవరేట్ హీరో సినిమా కోసం రోజులేంటి సంవత్సరాలైనా ఎదురుచూస్తాం. అదీ ఫ్యాన్స్ అంటే. అభిమాన నటుడి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకోవాలని, సినిమా సెట్స్ మీదకు రాక ముందు నుంచే అప్‌డేట్ అంటూ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు.
అగ్రహీరోల సినిమాలను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలనే ఉద్దేశంతో రీ షూట్లు ఎక్కువవడం, శాటిలైట్ హక్కులు, ఓటీటీ విక్రయాలు లాంటి కారణాలతో సినిమాలు లేట్ అవుతున్నాయి. పెద్ద సినిమాలకైతే ఈ తిప్పలు కచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇటువైపేమో సంవత్సరాలు గడుస్తున్నా తమ హీరోల నుంచి సినిమాలు రావడం లేదని అభిమానుల ఎదురుచూపులు ఎక్కువైపోతున్నాయి. మరి ఆ లిస్ట్‌లో ఉన్న సినిమాలేవి? ఏయే చిత్రాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారంటే?
పవన్ కల్యాణ్: ఆయనకో లెక్క ఉంటది అని పూర్తి నమ్మకం పవన్ మీదనే పెట్టుకుని ఎదురుచూసే అభిమానులు కోకొల్లలు. సంవత్సరాలు గడిచిపోయినా తెరపై ఆయన కనిపిస్తే చాలు అనుకుని ఎదురుచూస్తుంటారు. అలా పవన్ రాజకీయాలలో బిజీగా ఉన్నా సినిమా కోసం పడిగాపులు కాస్తున్నారు. రీసెంట్‌గా 'ఓజీ' షూటింగులలో పాల్గొంటూ సెప్టెంబర్ 27న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, ఆ రోజున రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్న సినిమాలో ఫస్ట్ పార్ట్‌కు సంబంధించి ఇంకా 20 రోజుల షూటింగ్ మిగిలే ఉంది. ఈ సినిమా డిసెంబరులో రిలీజ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
రామ్ చరణ్: 'ఆచార్య' తర్వాత వెండితెరపై కనిపించలేదు చెర్రీ. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'గేమ్ ఛేంజర్' ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ ఏడాది ఆరంభంలోనే సినిమా షూటింగ్ జరిగినా మధ్యలో 'భారతీయుడు-2' ఫినిషింగ్ బాధ్యతలు, తన కూతురి పెళ్లి ఉండటంతో డైరక్టర్ శంకర్ సినిమాను పూర్తి చేయడానికి ఊహించిన దాని కంటే ఎక్కువ సమయమే తీసుకున్నారు. ఇప్పటికి కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే దానిపై క్లారిటీ లేదు. రామ్ చరణ్ తో పాటు 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటించిన ఎన్టీఆర్ 'దేవర' సినిమాను సెప్టెంబర్ 27న థియేటర్లలోకి తీసుకురానున్నాడు.
మిస్టర్ బచ్చన్: టాలీవుడ్ బిగ్ బీ రవితేజ సినిమాలు పూర్తి చేయడంలో చాలా స్పీడ్. అలాంటిది 'ఈగల్' సినిమా తర్వాత కాస్త టైం తీసుకున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'మిస్టర్ బచ్చన్' సినిమాను చేస్తున్న ఆయన ప్రస్తుతం సాంగ్ షూటింగ్స్‌లో బిజీ అయిపోయారు. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పూర్తి చేసుకుని ఇదే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు కానీ, రిలీజ్ డేట్ మీద క్లారిటీ అయితే ఇంకా లేదు.
రామ్ పోతినేని: ఒక్కో సినిమాకు బాగా గ్యాప్ తీసుకునే రామ్ పోతినేని దర్శకుడు పూరి జగన్నాథ్ డైరక్షన్లో రెండో సినిమా చేస్తున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్‌గా రాబోతున్న 'డబుల్ ఇస్మార్ట్' దాదాపు పూర్తి కావొచ్చింది. ముందుగా జులైలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసిన యూనిట్, అల్లు అర్జున్ హీరోగా రూపొందిన 'పుష్ప-2' వాయిదా పడుతుందనే వార్తలు వినిపిస్తుండటంతో ఆగష్టుపై కన్నేసింది. మరోవైపు 'మట్కా'తో హీరో వరుణ్ తేజ్ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగతా పనులు పూర్తి చేసుకుని డిసెంబరులో స్క్రీన్స్ పైకి రానుంది.
డబ్బింగ్ ధమాకా: కథ బాగుండాలి. కనిపించే నటుడు ఆకట్టుకునేలా ప్రదర్శన చేయాలి. భాషదేముంది. అనుకునే వాళ్లకి డబ్బింగ్ సినిమాలు కూడా ఎదురుచూపుల్లోనే కాలం గడిపేస్తున్నాయి. విక్రమ్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా అయిన 'తంగలాన్' షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా, రిలీజ్ డేట్ ఇంకా కన్ఫార్మ్ చేసుకోలేకపోయింది. మరోవైపు సూర్య హీరోగా తెరకెక్కిన సోషియా ఫాంటసీ సినిమా 'కంగువా'ది కూడా ఇదే పరిస్థితి. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండి రిలీజ్ డేట్ ఇంకా కన్ఫార్మ్ చేయలేకపోతుంది.
అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేయడంపై స్పందించిన నిహారిక - ఏం చెప్పిందంటే?