Tamannaah IPL Streaming : ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను అక్రమంగా 'ఫెయిర్ ప్లే' అనే యాప్‌లో స్ట్రీమ్ చేసిన కేసులో బాలీవుడ్ బ్యూటీ తమన్నా భాటియాకు మహారాష్ట్ర సైబర్ పోలీసు విభాగం సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను ప్రశ్నించేందుకు ఈ నోటీసులిచ్చినట్లు పేర్కొంది. అంతే కాకుండా ఈ నెల 29న సైబర్ విభాగం ఎదుట తమన్నా విచారణకు హాజరు కావాలని సూచించింది.
నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ మ్యాచ్‌లను ఈ యాప్‌లో ప్రసారం చేయడం వల్ల ప్రముఖ మీడియా సంస్థ 'వయాకామ్' మీడియాకు రూ. కోట్ల మేర నష్టం జరిగిందంటూ సైబర్ విభాగం తాజాగా వెల్లడించింది.
ఇక ఇదే కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు కూడా సమన్లు జారీ అయ్యాయి. ఏప్రిల్ 23న ఆయన్ను విచారణకు రావాలని ఆదేశించగా, సంజత్ ఆ విచారణకు గైర్హాజరయ్యారు. అయితే ఆ సమయంలో తాను దేశంలో లేనని, వాంగ్మూలం ఇచ్చేందుకు మరో తేదీని కేటాయించాలని దత్ కోరారు.
ఎంటి ఈ 'ఫెయిర్ ప్లే'?
'ఫెయిర్ ప్లే' అనే యాప్ మహదేవ్ ఆన్‌లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్‌కు ఓ అనుబంధ సంస్థ. ఇందులో ఐపీఎల్ మ్యాచ్‌లను స్ట్రీమ్ చేసేందుకు ఎలాంటి అధికారిక బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు లేవు. అయినప్పటికీ గతేడాది నిబంధనలకు విరుద్ధంగా కొన్ని మ్యాచ్‌లను ఈ యాప్‌లో ప్రసారం చేశారు. అయితే వాటిని చూడాలంటూ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ప్రచారం చేశారు.
అయితే దీని వల్ల తమకు రూ. కోట్లల్లో నష్టం వచ్చిందంటూ వయాకామ్ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో గతంలో బాలీవుడ్ గాయకుడు బాద్‌షా, నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్, సంజయ్ దత్ మేనేజర్లను సైబర్ విభాగం ప్రశ్నించింది.
మరోవైపు గతేడాది కూడా మహదేవ్ బెట్టింగ్ యాప్ వార్తల్లో నిలిచింది. ఆన్‌లైన్ బెట్టింగ్ ముసుగులో మనీలాండరింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. దీంతో సదరు యాప్‌పై కేసు నమోదు చేసింది దర్యాప్తు చేపట్టింది. ఈ కేసు అప్పుట్లో బాలీవుడ్లో పెద్ద సెన్సేషన్‌గా మారింది. అప్పుడు కూడా పలువురు సినిమా స్టార్స్‌కు సమన్లు జారీ అయ్యాయి.