Zakir Hussain Achievements : ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడంత సాధించిన రికార్డులను నెమరువేసుకుందాం.
- 1951 మార్చి 9న ముంబయిలో జాకీర్ హుస్సేన్ జన్మించారు. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడైన జాకీర్‌హుస్సేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడిచారు. తన మొదటి గురువు తండ్రేనని అన్నారు.
- మూడు సంవత్సరాల వయసులోనే తబలా వాయించడం నేర్చుకున్నారు జాకీర్ హుస్సేన్. ఏడేళ్ల వయసులోనే బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు.
- 12 ఏళ్లకే అంతర్జాతీయ సంగీత కచేరీలు మొదలు పెట్టారు.
- హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్‌లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు.
- సంగీతంలో రాణిస్తూనే చదువుపైనా కూడా శ్రద్ధ పెట్టారు. ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు.
- 1990లో సంగీత్‌నాటక అకాడమీ అవార్డు, 2009లో గ్రామీ పురస్కారం అందుకున్నారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్‌తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గౌరవించింది.
- 2009లో మిక్కీ హార్ట్‌తో కలిసి ప్లానెట్ డ్రమ్ ఆల్బమ్ చేసినందుకు గ్రామీ అవార్డును దక్కించుకున్నారు. ఈ అవార్డును అందుకున్న కొద్ది మంది ప్రముఖుల్లో జాకీర్ కూడా ఒకరు.
- జాకీర్ హుస్సేన్ సినిమాకు మంచి సహకారం అందించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎన్నోసార్లు ప్రదర్శనలిచ్చారు. విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నారు.
- 2024లో జరిగిన 66వ గ్రామీ అవార్డుల్లో ఒకే రాత్రి మూడు ట్రోఫీలు గెలిచిన తొలి భారతీయుడిగా జాకీర్ చరిత్ర సృష్టించారు. మొత్తంగా ఐదు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు.
- ఆరు దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో, మన దేశంతోపాటు ఎంతోమంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి పని చేశారు.
అది ఎంతో ముఖ్యం - "ఎన్ని అవార్డులు వచ్చినా, ఎప్పుడూ నేర్చుకోగలగడం ఎంతో ముఖ్యం. మనల్ని మనం బెస్ట్ అని అనుకోకూడదని మా నాన్న చెబుతుండేవారు. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. మంచి విద్యార్థిగా ఉండాలి. అప్పుడే విజయం సాధించగలం. నేను గొప్ప సంగీత విద్వాంసులతో మాట్లాడినప్పుడు వారు కూడా ఇదే చెప్పారు. కొత్తదనాన్ని వెతుకుతూనే ఉన్నామని చెప్పారు. వారి మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి. నా రంగంలో నేను అత్యుత్తమంగా ఉన్నాను. అయినా ఎప్పుడూ దీని గురించి ఆలోచించలేదు. నాకన్నా గొప్ప తబలా విద్వాంసుల పేర్లు చెప్పమంటే కనీసం 15 మంది పేర్లు చెబుతాను" అని జాకీర్ హుస్సేన్ చెప్పారు.