Single Mother In South Industry : తరగని అందం, కన్ను ఆర్పనీయకుండా కట్టిపడేసే అభినయం, అదరగొట్టే నాట్యం కలగలిపి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో దాదాపు 230 చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించిన నటి. రెండు చిత్రాల్లో ఏకంగా జాతీయ అవార్డులను గెలుచుకున్న ఆమె యాభై ఏళ్లు పైబడినా వివాహం చేసుకోకుండా ఒంటరి తల్లిగా జీవిస్తున్నారు. ఆమె ఎవరో ఈపాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును మనం మాట్లాడుకుంటుంది ఎవర్గ్రీన్ గ్రేస్‌ఫుల్ బ్యూటీ శోభన గురించే. ఇన్నేళ్ల తర్వాత కూడా తన నటతో మనల్ని మెప్పిస్తున్నఅలనాటి అందాల తార శోభన గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బాలనటి నుంచి ఎవర్ గ్రీన్ లేడీ వరకూ
శోభన అసలు పేరు శోభనా చంద్రకుమారన్ పిళ్లై. 1970 మార్చి 21న కేరళలోని తిరువనంతపురంలో జన్నించారు. ప్రముఖ నటులు, నృత్యకారణిలు అయిన లలిత, పద్మిని, రాగిణిలకు ఈమె మేనకోడలు. పదేళ్ల వయసులోనే 1980లో శ్రీకాంత్, కేఆర్ విజయ నటించిన తమిళ చిత్రం మంగళ నాయకన్తో అరగేంట్రం చేశారు. ఆ తరువాత 'మన్మధ రాగంగల్'లోనూ ఈమె నటించారు.
'భక్త ధృవ మార్కండేయ'లో బాలనటిగా కనిపించి అలరించారు. 1984లో విడుదలైన 'ఏప్రిల్ 18'చిత్రంతో 14ఏళ్ల వయసులోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలచంద్ర మేనన్ నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అదూర్ భాసి, భరత్ గోపీలు ముఖ్యపాత్రల్లో కనిపించారు. ఇందులో తన నటనకుగానూ శోభన విమర్శకుల నుంచి ప్రశంసలను కూడా పొందారట.
ఇలా చైల్డ్ ఆర్టిస్ట్‌గా అదరగొడుతున్న ఈమెకు 'ఫర్జ్' రిమేక్‌గా తమిళంలో తెరకెక్కిన 'ఎనక్కుల్ ఒరువన్' చిత్రంలో కమల్‌హాసన్ సరసన ప్రధాన పాత్రలో కనిపించే అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేనప్పటికీ అనేక తమిళ సినిమాల్లో అవకాశాలు తెచ్చిపెట్టింది. అప్పట్లో సత్యరాజ్, విజయ్ కాంత్, భాగ్యరాజ్లతో కలిసి తమిళంలో శోభన చాలా సినిమాల్లో నటించారు.
మలయాళ పరిశ్రమలోనూ శోభన చెరగని ముద్ర వేశారు. 'కనమరాయతు', 'ఇత్తిరి పూవే' 'చూవన్నా పూవే', 'నాడోడిక్కట్టు', 'వెల్లనకలుడే' వంటి అనేక క్లాసికల్ సినిమాల్లో శోభన నటించారు. మలయాళ సూపర్ స్టార్స్ మెహన్ లాల్, మమ్ముట్టిల సరసన శోభన మంచి జోడీ అని అంతా అనుకునేవారు. 1980ల్లో టాప్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకటిగా నిలిచారు.
తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లోనూ
అదే సమయంలో 'విక్రమ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తరువాత వరుసగా'అజేయుడు', 'రుద్రవీణ', 'త్రిమూర్తులు', 'ఏప్రిల్ 1' విడుదల, 'అభినందన', 'నిప్పు రవ్వ', వంటి సినిమాలతో టాలీవుడ్ టాప్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌లతో కలిసి నటించింది. 1990ల్లో రజనీకాంత్-మణిరత్నం కాంబోలో వచ్చిన 'దళపతి', చిరంజీవితో 'రౌడీ అల్లుడు', విష్ణువర్ధన్తో 'శివశంకర్' సినిమాల్లో మంచి నటనను కనబరిచింది. మోహన్ లాల్‌తో కలిసి శోభన నటించిన 'ఇతిహాసం మణిచిత్రతాఝ' చిత్రంలో మొదటిసారిగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు శోభన.
ఇరవైవ దశకంలో హిందీ సినిమాల్లోకి వెళ్లిన ఈ నటి 'అప్నా ఆస్మాన్', 'మేరే బాప్ పెహ్లే ఆప్' వంటి చిత్రాల్లో నటించారు. అంతేకాదు 2002లో ఆంగ్ల భాష చలనచిత్రమైన 'మిత్ర మై ఫ్రెండ్' సినిమాలో శోభన ప్రధాన పాత్రలో కనిపించారు. దీనికి గానూ ఆమె ఉత్తమ నటిగా రెండో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. అలా దాదాపు మూడు దశాబ్దాల పాటు సినిమాలతో బిజీబిజీగా గడిపిన శోభన నెమ్మదిగా నటనకు దూరమయ్యారు. చివరగా తెలుగులో మోహన్ బాబు, మంచు విష్ణు కాంబోలో 'గేమ్' సినిమాల్లో కీలక రోల్లో నటించారు. సినిమాలకు దూరమైన ఆమె తనకెంతో ఇష్టమైన డ్యాన్స్‌పై దృష్టి పెట్టారు. కొరియోగ్రాఫర్‌గా, డ్యాన్సర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఒంటరి తల్లిగానే
శోభన గురించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే 54 ఏళ్ల వయసున్న ఈ భామ ఇప్పటివరకూ వివాహం చేసుకోనేలేదు. దీని గురించి చాలా మంది ప్రశ్నించగా చేసుకునే ఉద్దేశాలు లేనట్లుగానే ఆమె స్పందించారు. అంతేకాదు 2011లో ఓ ఆడపిల్లను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు శోభన. ప్రస్తుతం చెన్నైలో డ్యాన్స్ స్కూల్ పెట్టి చాలా మందికి శాస్త్రీయ భరతనాట్యం నేర్పిస్తున్నారు.
మళ్లీ సినిమాల్లోకి
18 ఏళ్ల తరువాత తాజాగా టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ 'కల్కి 2928ఏడీ' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. నాగ్ అశ్విన్ తెరక్కెక్కించిన ఈ చిత్రంలో శోభన శంబాలా నాయకురాలిగా కనిపించి తన నటనతో మెప్పించారు. ప్రస్తుతం ఈమె మోహన్ లాల్, రజనీ కాంత్లలో మరో రెండు సినిమాల్లోనూ కనిపించనున్నారని తెలుస్తోంది.