Samantha Citadel Honey Bunny : స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన 'సిటడెల్ : హనీ బన్నీ' తాజాగా ఓ అరుదైన ఘనతను సాధించింది. ఇండస్ట్రీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుకు ఈ సిరీస్ నామినేట్ అయ్యింది. ఈ విషయాన్ని డైరెక్టర్ రాజ్ అండ్ డీకే అభిమానులతో పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా క్రిటిక్స్ ఛాయిస్ నామినేషన్స్‌లో సిటడెల్ ఉత్తమ విదేశీ భాష సిరీస్‌లలో స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 12న జరగనున్నట్లు చెప్పారు. అయితే ఈ నామినేషన్లలో పాపులర్ కొరియన్ సిరీస్ స్క్విడ్ గేమ్ ఉండటం విశేషం.
ఇక సిటాడెల్ విషయానికి వస్తే, 'ఫ్యామిలీ మ్యాన్', 'ఫర్జీ' లాంటి సక్సెస్ఫుల్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించిన రాజ్ అండ్ డీకే ఈ సిటాడెల్‌ను తెరకెక్కించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే రిలీజైన నాటినుంచి టాప్‌లో కొనసాగుతూ అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది.
స్టోరీ ఏంటంటే?
హనీ (సమంత) నైనిటాల్‌లోని ఓ కెఫేలో పనిచేస్తుంటారు. ఆమెకు నాడియా (కశ్వీ మజ్ముందార్) అనే ఐదేళ్ల కూతురు ఉంటుంది. కెఫే కోసం సరకులు తీసుకురావడానికి మార్కెట్‌కు వెళ్లిన సమయంలో హనీని ఓ వ్యక్తి అనుసరిస్తూ ఉంటాడు. అది గమనించిన ఆమె అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి ఆఖరికి పట్టుబడుతుంది. అయితే అతడి చెర నుంచి ఎలాగోలా తప్పించుకుని తన కుమార్తెను తీసుకుని వేరే ఊరికి వెళ్లిపోతుంది. అయితే హనీ ఎక్కడ ఉందో తెలుసుకుని ఆమెను పట్టుకునేందుకు కొందరు వ్యక్తులు అక్కడికి వెళ్తారు.
మరోవైపు విదేశాల్లో ఉన్న బన్నీ, చనిపోయిందనుకున్న తన భార్య హనీ బతికే ఉందన్న విషయం తెలుసుకుని ఆమెను వెతుక్కుంటూ భారత్‌కు వస్తాడు. అయితే హనీ వెంట పడుతున్న ఆ వ్యక్తులు ఎవరు? ఎంతటి వారితోనైనా పోరాడే సామర్థ్యం ఆమెకు అలా ఎలా వచ్చింది? ఇంతకీ ఆమె పాస్ట్ ఏంటి? తన భార్యను వెతుక్కుంటూ వచ్చిన బన్నీకి ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు హనీని, అలాగే తన బిడ్డ నాడియాను బన్నీ కలిశాడా? లేదా? అన్న విషయాలు తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే!