Raveena Tandon Defamation Case : బాలీవుడ్ నటి రవీనా టండన్ తాజాగా ఓ వ్యక్తిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. తనకు సంబంధించిన ఓ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకుగానూ ఆమె ఈ చర్యకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా ఆమె ఆ వ్యక్తిని నోటీసులను పంపారు. ఇంతకీ ఏమైందంటే?
ఇటీవలే నటి రవీనా టండన్‌కు సంబంధిన ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. అందులో ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ ముగ్గురు మహిళలను ఢీ కొట్టిందని, అందులో వారు గాయపడినట్టు కొందరు కామెంట్ చేశారు.
దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి నెట్టింట పోస్ట్ చేశాడు. అంతే కాకుండా ఆమె ఆ సమయంలో మద్యం తాగారని పేర్కొన్నారు. అంతే కాకుండా ఆ మహిళలతో రవీనా వాగ్వాదానికి దిగినట్లు పేర్కొన్నారు. దీంతో ఆగ్రహించిన రవీనా ఆ వ్యక్తిపై పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో రవీనా తరఫు న్యాయవాది సనా ఖాన్ ఈ విషయంపై తాజాగా వ్యాఖ్యానించారు.
"ఇలాంటి ఫేక్ న్యూస్‌ను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేసి రవీనా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. ఆమె పేరును వాడుకుని పబ్లిసిటీ పొందాలనుకుంటున్నారు. దీనిపై చట్టపరమైన చర్యలను తీసుకుంటున్నాం" అంటూ చెప్పారు.
మరోవైపు ఈ ప్రమాదంపై పోలీసులు కూడా తాజాగా స్పందించారు. రవీనా, ఆమె డ్రైవర్ ఎవరూ మద్యం సేవించలేదని వారు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను సైతం మీడియా కోసం విడుదల చేశారు. దీంతో పోలీసులు విడుదల చేసిన స్టేట్‌మెంట్ ఆధారంగానే రవీనా ఆ వ్యక్తిపై ఇప్పుడు దావా వేశారు.
"రవీనా, ఆమె డ్రైవర్‌పై తప్పుడు కేసు పెట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ను చూశాం. కారును పార్క్ చేసేందుకు డ్రైవర్ రివర్స్ చేసే సమయంలో ఓ కుటుంబం ఆ పక్క నడుచుకుంటూ వెళ్లింది. వారే కారును ఆపి డ్రైవర్‌తో గొడవ పడ్డారు. రివర్స్ చేస్తున్నప్పుడు వెనకవైపు చూసుకోవాలంటూ గొడవకు దిగారు. ఇది తీవ్రమైంది. ఈ క్రమంలోనే రవీనా గొడవను ఆపేందుకు ప్రయత్నం చేశారు. అనంతరం గొడవపడిన వ్యక్తులు స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు" అని పోలీసులు తెలిపారు.