Ratan Tata Biopic Movie : పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఇక లేరనే వార్త చాలా మంది సామాన్యులతో పాటు ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలను కలచివేస్తోంది. దీంతో ఆయన లేని లోటు తీరనిది అంటూ సోషల్ మీడియా వేదికగా అందరూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రతన్ టాటాకు సంబంధించిన బయోపిక్, డాక్యుమెంటరీల గురించి వివరాలు బయటకు వస్తున్నాయి. రతన్ టాటా గురించి డిస్నీ+ హాట్‌స్టార్ ఓ ఎపిసోడ్ చేసింది. మెగా ఐకాన్స్ సీజన్ 2లో ఎపిసోడ్2లో రతన్ టాటా గెస్ట్‌గా హాజరై తన ప్రయాణానికి సంబంధించిన కొన్ని విశేషాలను తెలిపారు. ప్రస్తుతం ఇది ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో దీన్ని డిస్నీ+ హాట్‌స్టార్‌లో చూడొచ్చు. ఈ డాక్యుమెంటరీ ఆసియా టెలివిజన్ అవార్డుకు కూడా నామినేట్ అయి ఉత్తమ డాక్యుమెంటరీగా సిరీస్ టైటిల్‌ను ముద్దాడింది.
ఈ డాక్యుమెంటరీ ఎపిసోడ్‌లో తక్కువ ధరలో సామాన్యులకు అందుబాటులో ఉండేలా కారును తీసుకురావాలనే ఆలోచన వెనక ఉన్న అసలు కారణాన్ని వివరించారు రతన్ టాటా. "ఒకసారి నేను కారులో వెళ్తున్నప్పుడు స్కూటర్‌పై ప్రయాణిస్తున్న కుటుంబాన్ని చూశాను. తల్లి, తండ్రితో పాటు ఇద్దరు పిల్లలు అందరూ ఒకే స్కూటర్‌పై వెళ్తున్నారు. కొంత సేపు తర్వాత వాళ్లు కిందకు జారి పడ్డారు. ఆ సంఘటన నన్ను ఆలోచింపజేసింది. స్కూటర్‌ను సేఫ్టీగా ఎలా మార్చాలి అని బాగా ఆలోచించాను. ఆ ఆలోచనే నన్ను తక్కువ ధరకు కారు సిద్ధం చేసేలా చేసింది." అని రతన్ చెప్పారు. దీన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి పడిన కష్టాన్ని ఆ ఎపిసోడ్‌లో రతన్ వివరించారు.
బయోపిక్‌పై వార్తలు - ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర రతన్ టాటా బయోపిక్ తీయనున్నట్లు 2022లో ప్రచారం సాగింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ - వీరిలో ఎవరైనా నటించే అవకాశం ఉందని పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే దీనిపై సుధా కొంగర క్లారిటీ ఇచ్చారు. రతన్ టాటా అంటే నాకు ఎంతో ఇష్టం, గౌరవం. ప్రస్తుతానికి ఆయన బయోపిక్ తెరకెక్కించడం లేదు అని చెప్పుకొచ్చారు.
రతన్ టాటాపై పుస్తకాలు(Ratan Tata Books) - రతన్ టాటా జీవితం, ఆయన ప్రయాణం, ఆయన ఎదుర్కొన్న ఒడుదొడుకులపై ఎన్నో పుస్తకాలను రచించారు. రతన్ టాటా విలువలు ఈ పుస్తకాల రూపంలో ఉన్నాయి. సమాజానికి జ్ఞానాన్ని పంచేలే ఇవి ఉన్నాయని పలువురు అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. జీవితంలో గొప్పగా ఎదగాలంటే ఇవి ఉపయోగపడతాయని చాలా మంది చెప్పుకొచ్చారు.
'వేట్టాయన్' - ది హంటర్ రివ్యూ ఇదే - సినిమా ఎలా ఉందంటే?
రజనీ కాంత్ 'వేట్టాయన్' - ఒకే థియేటర్‌లో సినిమా చూసిన ధనుశ్, ఐశ్వర్య