Ramoji Rao Passed Away : ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది. ఓం శాంతి' అంటూ ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు.
నూటికో కోటికో ఒక్కరే ఉంటారు : తారక్
రామోజీ రావు మృతిపై హీరో జూనియర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒక్కేరే ఉంటారు అంటూ వ్యాఖ్యానించారు.
"శ్రీ రామోజీ రావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత, భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. 'నిన్ను చూడాలని' చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
రామోజీరావు అస్తమయంపై సినీ నటి ఖుష్బూ సంతాపం వ్యక్తం చేశారు. సినీరంగం లెజెండ్‌ను కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు : పవన్ కల్యాణ్
- అక్షరయోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను: పవన్ కల్యాణ్
- ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా
- ఆయన స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనమే
- అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు
- ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ, జన చైతన్యాన్ని కలిగించారు
- ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు: పవన్ కల్యాణ్
- రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ను వేదికగా చేశారు
- ఆయన కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి: కల్యాణ్‌రామ్
"రామోజీరావు భారతీయ మీడియా, చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి".
రామోజీగారికి భారతరత్న ఇవ్వడమే ఘనమైన నివాళి: రాజమౌళి
"తన కృషితో లక్షలాది మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి రామోజీరావు. 50 సంవత్సరాల నుంచి ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తున్నారు. 'భారతరత్న'తో ఆయనను సత్కరించడమే మనమిచ్చే ఘనమైన నివాళి".
నా గాడ్‌ఫాదర్ మృతి పరిశ్రమకు తీరని నష్టం: నరేశ్
"రామోజీ రావు గారు మరణించారనే హృదయ విదారక వార్త విని బాధపడ్డా. ఆయన నా సినీ కెరీర్‌కు పునాది వేశారు. నా గాడ్ ఫాదర్, నా స్ఫూర్తి. తెలుగు చిత్రపరిశ్రమను గొప్ప స్థాయికి తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి. ఆయన మృతి పరిశ్రమకు తీరని నష్టం. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియచేస్తున్నా"
రామోజీరావు నిజమైన దార్శనికుడు : వెంకటేశ్
రామోజీరావు గారు నిజమైన దార్శనికుడు, భారతీయ మీడియాలో ఆయన విప్లవాత్మక కృషి చేశారు. జర్నలిజం, సినీ రంగంలో ఆయన చేసిన కృషి ఎంతోమందికి స్ఫూర్తి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి - సినీ నటుడు వెంకటేశ్