Rajasaab Movie Shooting Update : 'కల్కి 2898 AD' లాంటి భారీ హిట్ అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలోనే 'రాజాసాబ్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గ్యాప్ లేకుండా సినిమాలు ఒప్పేసుకున్న ఆయన స్పీడ్ పెంచి, రాజాసాబ్ కంప్లీట్ చేయడమే ఫస్ట్ టాస్క్‌గా పెట్టుకున్నారు. వాస్తవానికి, మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కల్కి సినిమా రిలీజ్ కాకముందే మొదలుపెట్టేశారు. అయితే ప్రభాస్ అడపాదడపా ఇచ్చిన డేట్లకు అనుగుణంగా సినిమా తీయడం మొదలుపెట్టిన మారుతీ ఇప్పుడు ప్రభాస్ డేట్లు వరుసగా దొరకడంతో వేగం పెంచేశారు.
వచ్చే ఏడాది సమ్మర్ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దానికి తగ్గట్లుగానే ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ పూర్తి చేయాలనే టార్గెట్‌తో పని చేస్తున్నారు మారుతీ. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ప్రభాస్‌ను ఎన్నడూ చూడని విధంగా చూపిస్తానని, పక్కా మాస్ క్యారెక్టర్‌లో కనిపిస్తారంటూ మాటిచ్చారు కూడా. కామెడీతో పాటు హర్రర్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అలానే వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం దాదాపు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందట. అవన్నీ దృష్టిలో ఉంచుకుని మూడు, నాలుగు నెలలు ముందుగానే అంటే నవంబరు నాటికి చిత్రీకరణ పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు మారుతీ. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టి సమ్మర్ నాటికి థియేటర్లలోకి తీసుకురానున్నారు.
మొదట చిన్న సినిమాగా అనుకున్న 'రాజాసాబ్' దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవికా మోహనన్‌తో పాటు నిధి అగర్వాల్‌లు ఇందులో ప్రధాన కథానాయికలుగా కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
కాగా, సినిమా షూటింగుల్లో పాల్గొంటున్న మాళవికా మోహనన్ కూడా తాజాగా ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడంపై స్పందించారు. "రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోన్న రాజాసాబ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కావడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలో నా పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. ప్రభాస్ లాంటి మంచి వ్యక్తితో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన ఇంటి భోజనం ఎంతో రుచికరంగా ఉంటుంది" అని మనసులో మాట బయటపెట్టారు.
ప్రధాని మోదీకి రజనీ కాంత్ స్పెషల్ థ్యాంక్స్ - Rajinikanth Thanks To PM Modi