Oscar Awards 2024 Best Documentary Feature Film: 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగింది. పలు కేటగిరీల్లో ఆయా దేశాల నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు దక్కించుకున్నారు. హాలీవుడ్ సినిమా ఓపెన్‌హైమర్ ఈ ఏడాది అత్యధికంగా ఏడు అవార్డులు దక్కించుకుంది. కాగా, గతేడాది మూడు విభాగాల్లో అవార్డులు దక్కించుకున్న భారత్‌కు ఈసారి నిరాశే ఎదురైంది. అయితే ఈసారి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారతీయ కథ 'టు కిల్ ఏ టైగర్' 2024 ఆస్కార్ రేసులో నిలిచింది.
ఎన్నో ప్రశంసలు అందుకున్న ఈ డాక్యుమెంటరీ ఇప్పటికే పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. దీంతో ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్ కూడా వరిస్తుందనుకున్నారు. కానీ, ఈ విభాగంలో హాలీవుడ్ ఫిల్మ్ '20 డేస్ ఇన్ మారియుపోల్' అవార్డు దక్కించుకుంది. దీంతో వరుసగా రెండో ఏడాది భారతీయ సినిమా ఆస్కార్ అందుకుంటుందనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. కాగా, గతేడాది మన దేశం నుంచి ఇదే కేటగిరీలో 'ది ఎలిఫెంట్ విష్పరర్స్' (The Elephant Whisperers) డాక్యుమెంటరీ ఆస్కార్ పొందింది.
20 Days in Mariupol Documentary: రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత సీజ్ చేసిన మారియుపోల్ అనే ఓడరేవు నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ రూపొందింది. యుద్ధం సమయంలో ఉక్రెయిన్ జర్నలిస్టులు ఎదుర్కొన్న సవాళ్లను ఇందులో చూపించారు డైరెక్టర్ చెర్నోవ్. ఈ సినిమాను 2023లో సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఇదే సమయంలో ఈ సినిమా 'సన్‌డాన్స్ వరల్డ్ సినిమా డాక్యుమెంటరీ' పోటీలో నెగ్గింది.
To kill a Tiger Documentary: టు కిల్ ఏ టైగర్ విషయానికొస్తే, ఝార్ఖండ్‌లో ఓ మారుమూల పల్లెలో 13ఏళ్ల ఆమ్మాయిపై లైంగిక దాడి జరుగుతుంది. తన కూతురిని కిడ్నాప్ చేసి ఆమెపై అఘాత్యానికి పాల్పడిన ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలని రంజిత్ అనే ఓ తండ్రి జరిపిన న్యాయ పోరాటమే ఈ డాక్యుమెంటరీ నేపథ్యం.
2024 ఆస్కార్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్- 'ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్'ను వరించిన అవార్డ్
2024 ఆస్కార్‌లో 'ఓపెన్‌హైమర్' జోరు- బెస్ట్ యాక్టర్, డైరెక్టర్ సహా 7 అవార్డులు