Kapil Sharma Director Atlee : దర్శకుడు అట్లీ సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురవ్వడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా తన లుక్, కలర్ విషయంలోనూ పలు సార్లు ట్రోల్స్‌కు గురయ్యాడు. అయితే విమర్శలు ఎన్ని ఎదుర్కొన్నా, తన సినిమాల సక్సెస్ రూపంలో వాటికి సమాధానం చెబుతూనే ఉంటాడు. అలా చివరిగా జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోనూ తన పేరు మార్మోగేలా చేశాడు. అయితే తాజాగా మరోసారి తన లుక్ విషయంలో విమర్శలకు గురయ్యాడు. అదే సమయంలో తిరిగి గట్టి కౌంటర్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగింది? ఏమన్నారు?
దర్శకుడు అట్లీ ప్రస్తుతం 'బేబీ జాన్' ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటున్నాడు. ఇందులో భాగంగా తాజాగా ఆయన ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొని సినిమా విశేషాలు పంచుకున్నాడు. ఈ క్రమంలోనే అట్లీ లుక్‌పై కపిల్ విమర్శలు చేస్తూ దర్శకుడిని అవమానించేలా వ్యవహరించాడు.
"కథ చెప్పడం కోసం ఎవరినైనా స్టార్ హీరోను మీరు కలిసినప్పుడు, వాళ్లు అట్లీ ఎక్కడ అని అడుగుతారా?" అని కపిల్ ప్రశ్నించాడు. దీంతో అతడి మాటల్లోని అర్థాన్ని అర్థం చేసుకున్న అట్లీ తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చాడు. "మీరెందుకు ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నారో నాకు అర్థమైంది. మీ ప్రశ్నకు నా సమాధానం ఒక్కటే. టాలెంట్ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామనేది పెద్ద విషయం కాదు. నిజం చెప్పాలంటే, దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌కు నేను కృతజ్ఞతలు చెప్పాలి. మొదటి సారి ఒక కథతో ఆయన వద్దకు వెళ్లినప్పుడు, ఆయన కేవలం నా స్క్రిప్ట్ గురించే ఆలోచించారు తప్ప నా లుక్ ఎలా ఉందనేది చూడలేదు. నా కథపై నమ్మకం ఉంచి నా మొదటి చిత్రానికి నిర్మాతగా చేశారు. కాబట్టి, ప్రపంచం మొత్తం కూడా మన పనినే చూడాలి. రూపం ఆధారంగా మనల్ని అంచనా వేయకూడదు" అని అట్లీ సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కపిల్ తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు. షోకు ఆహ్వానించి ఇలా అవమానించడం కరెక్ట్ కాదని ఫైర్ అవుతున్నారు.
క్రిస్మస్ స్పెషల్ - ఈ వారం థియేటర్/ఓటీటీలో 20 సినిమా,సిరీస్‌లు!