Samantha Citadel Webseries : హీరోయిన్ సమంత నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ : హనీ బన్ని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో బిజీ అయింది సామ్. రీసెంట్‌గానే ట్రైలర్ కూడా రిలీజై ఆకట్టుకుంది. ఇందులో ఆమె యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టింది.
అయితే ఈ సిరీస్‌లో తన పాత్ర కోసం మొదట మేకర్స్ సంప్రదించినప్పుడు, తాను తిరస్కరించినట్లు గుర్తుచేసుకుంది సమంత. "అందుకే దర్శకులు నన్ను సంప్రదించగానే నేను చేయలేనని చెప్పాను. నిజంగా ఈ పాత్రను చేయగలనని అనుకోలేదు. ఈ పాత్రకు సరిపోయే నలుగురు హీరోయిన్ల పేర్లను కూడా రాజ్ డీకేకు సిఫార్సు చేశాను. వాళ్లు ఈ పాత్రకు కచ్చితంగా న్యాయం చేయగలరని చెప్పాను. అసలు నేను చేయలేనని వేడుకున్నాను. అయినా కూడా వాళ్లు పట్టుబట్టి నాకోసం ఎదురు చూశారు. ఇప్పుడు సిరీస్ పూర్తయ్యాక ఇంత గొప్ప పాత్ర ఇచ్చిన దర్శకులకు ధన్యవాదాలు చెప్పాను. మరొకరిని తీసుకోకుండా నాతో చేయించడం నా అదృష్టంగా భావించాను" అని పేర్కొంది.
రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కింది సిటాడెల్ : హనీ బన్ని. ఇందులో సమంత,వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించారు. నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో క్లైమాక్స్ సన్నివేశం హైలైట్ కానుందని సమంత చెప్పింది. 11 నిమిషాల ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో ఎలాంటి కట్స్ లేకుండా చిత్రీకరించినట్లు తెలిపింది.
అంతకుముందు ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా ఏమాయ చేశావే కోసం జరిగిన ఆడిషన్స్‌ను గుర్తుచేసుకుంది. "నా మొదటి చిత్రం ఏ మాయ చేశావే సమయంలో జరిగిన ఆడిషన్‌కు ఇప్పుడు సిటాడెల్: హనీ బన్ని కోసం జరిగిన ఆడిషన్‌కు చాలా తేడా ఉంది. ఈ వెబ్ సిరీస్‌లో చెత్తనటిగా (నటించడం రాని అమ్మాయిగా) నటించాలి. నేను ఆ ఆడిషన్‌ను బాగా ఇచ్చాను. ఆ సీన్లో ఎందుకు బాగా నటించానంటే, ఇప్పటికీ నేను సగభాగం చెత్త నటినే (నవ్వుతూ) కాబట్టి. ఇప్పటికీ అలానే ఉన్నాను. నేను నా బెస్ట్ ఇచ్చానంటే దాని క్రెడిట్ అంతా నాకు దక్కదు. సరైన టీమ్ చేతుల్లో ఉన్నప్పుడే మనలోని మంచి నటన బయటకు వస్తుంది" అని చెప్పింది.