Janaka Aithe Ganaka Review
చిత్రం : జనక అయితే గనక;
నటీనటులు : సుహాస్, సంగీర్తన విపిన్, రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ, వెన్నెల కిశోర్, మురళీశర్మ, ప్రభాస్ శ్రీను తదితరులు
సినిమాటోగ్రఫీ : సాయిశ్రీరామ్;
సంగీతం: విజయ్ బుల్గానిన్;
ఎడిటింగ్: పవన్‌కల్యాణ్ కోదాటి;
ప్రొడక్షన్ డిజైన్: అరసవెల్లి రామ్‌కుమార్;
సమర్పణ: శిరీష్;
నిర్మాణం: హర్షిత్ రెడ్డి, హన్షిత;
దర్శకత్వం: సందీప్ రెడ్డి బండ్ల;
సంస్థ: దిల్‌రాజు ప్రొడక్షన్స్
ఈ దసరా విడుదలైన చిత్రాల్లో జనక అయితే గనక. ఈ మధ్య విభిన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటుడు ఈ చిత్రంలో నటించారు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ నిర్మించడం, ప్రచార చిత్రాలూ ఆకట్టుకోవడంతో సినిమాపై కాస్త బచ్ నెలకొంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే? సుహాస్ ఖాతాలో విజయం పడిందా?
కథేంటంటే? - మధ్య తరగతి కుటుంబానికి చెందిన ప్రసాద్, ఎప్పుడు తన తండ్రి (గోపరాజు రమణ) పై కోపం ప్రదర్శిస్తుంటాడు. తనకు మధ్య తరగతి జీవితం రావడానికి కారణం తన తండ్రి తీసుకున్న నిర్ణయాలే కారణమని అతడి భావన.
అయితే పెళ్లి తర్వాత భార్య (సంగీర్తన విపిన్)తో కలిసి ఎంతో ప్రేమగా గడుపుతుంటాడు ప్రసాద్. పెళ్లి జరిగి రెండేళ్లు అయినా పిల్లల కనే ఆలోచనను పెట్టుకోడు అతడు. ఎందుకంటే పిల్లల్ని కంటే, వారి కోసం ప్రస్తుతం సమాజంలో ఉన్నత చదువులు, ఇతర అవసరాల కోసం రూ.కోటిపైనే ఖర్చు అవుతుందని అతడి ఆలోచన. అలానే భార్య ఉత్తమమైన వైద్యం అందించాలి. అది చేయలేనప్పుడు కనడమే వృథా అనేది ప్రసాద్ సిద్ధాంతం. దీంతో భార్య కూడా ప్రసాద్ ఏం చెబితే అదే చేస్తుంటుంది.
కానీ ఓ రోజు అనుకోకుండా తాను గర్భం దాల్చినట్టు ప్రసాద్ భార్య చెబుతుంది. దీంతో ఆమె గర్భానికి కారణం తాను వాడుతున్న కండోమ్స్‌లో నాణ్యత లేకపోవడమేనని నిర్ణయించుకున్న అతడు, కోర్టు మెట్లు ఎక్కుతాడు. కండోమ్స్ కంపెనీ నుంచి రూ.కోటి పరిహారం కోరుతాడు. మరి ఈ కేసులో ప్రసాద్ గెలిచి, కోటి పరిహారం అందుకున్నాడా లేడా? అనేదే చిత్ర కథ.
ఎలా ఉందంటే? - ప్రస్తుత సమాజంలో పిల్లల్ని కనడానికి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఎందుకొస్తోందనే అంశాన్నీ సినిమాలో ప్రధానంగా చర్చించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ చిరుద్యోగి, బడా కంపెనీపై పోరాటం ఎలా చేశాడనేది మరో పాయింట్. అసలు పిల్లలు అనే ఎమోషన్ చాటున ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతోంది?, అసలు ఈ పోరాటం కంపెనీపైనే కాదు, మన వ్యవస్థపై అనే విషయాన్ని చూపించారు.
అలాగే మధ్య తరగతి జీవితాలు, వాళ్ల ఆశలు, ఆవేశాలు, అనుబంధాల్నిని చూపిస్తూనే, ఇప్పుడు పిల్లలు చదువులు ఎలా ఉన్నాయి, వైద్యం కోసం ఎంత ఖర్చు అవుతుందనేది సెటైరికల్‌గా కళ్లకు కట్టినట్టు చూపించారు.
అయితే ఆరంభ సన్నివేశాలతోపాటు, ద్వితీయార్ధంలో కొంత భాగం సాగదీతలా అనిపిస్తుంది. మొత్తంగా సున్నితమైన కథకు ఆరోగ్యకరమైన హాస్యం మేళవించిన తీరు బాగుంది. సినిమాకు మాటలు, హాస్యం బలాన్నిచ్చాయి.
ఎవరెలా చేశారంటే? - సుహాస్ మధ్య తరగతి యువకుడి పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. తండ్రి, స్నేహితుడు, భార్యతో కలిసి హాస్యాన్ని, భావోద్వేగాల్ని పండించిన తీరు బాగుంది. కోర్టు రూమ్ డ్రామాలోనూ మంచిగా నటించాడు. ప్రసాద్ భార్యగా నటించిన సంగీర్తన విపిన్ నటన కూడా బానే ఉంది. గోపరాజు రమణ, వెన్నెల కిశోర్, రాజేంద్ర ప్రసాద్, ప్రభాస్ శ్రీను సహా ఇతర పాత్రలు నవ్వుల్ని పంచుతాయి. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. విజయ్ బుల్గానిన్ సంగీతం, సాయి శ్రీరామ్ కెమెరా పనితనం బాగుంది. దర్శకుడి రచనలో బలం ఉంది.
చివరగా: జనక అయితే గనక చూడొచ్చు నవ్విస్తుంది గనక
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
'జిగ్రా' రివ్యూ - అలియా భట్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
'మార్టిన్' రివ్యూ - ధృవ సర్జా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?