Female Stars Pledge Organ Donation : అన్ని దానాల్లోకెల్లా అవయవ దానం గొప్పది. మరణించిన తర్వాత దానం చేసే అవయవాలు మరొకరికి జీవితాన్ని ఇస్తాయి. ఈ అంశంలో కూడా బాలీవుడ్ సెలబ్రిటీలు అందరికీ ఆదర్శనంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది హీరోయిన్లు అవయవాలు దానం చేయడానికి అంగీకరించారు. ఈ జాబితాలో ఉన్న ప్రముఖ హీరోయిన్లు ఎవరంటే?
ఆలియా భట్
సామాజిక అంశాలపై ఆలియా భట్ తరచూ స్పందిస్తుంటారు. స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరై అవయవ దానంపై అవగాహన కల్పిస్తుంటారు. గతంలో 'ప్రపంచ కిడ్నీ దినోత్సవం' సందర్భంగా ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసిన సదస్సులో ఆమె ఈ విషయం గురించి మాట్లాడారు.
"అవయవ దానంలో ఉన్న గొప్పతనం చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. కొందరు భయంతో ముందుకు రావట్లేదు. వారిలో ఉన్న భయాన్ని పోగొట్టాలి. జీవించి ఉండగానే చేసే అవయవ దానం, మరణానంతరం చేసే అవయవ దానం, అవయవ మార్పిడి అంశాలపై ఆయా సంస్థలు అవగాహన పెంచాలి. నేనూ నా కిడ్నీలను దానమిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా. నా ద్వారా ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులకు పునర్జన్మ లభిస్తుందంటే అంతకు మించిన ఆనందం లేదు." అని చెప్పుకొచ్చారు.
ప్రియాంక చోప్రా
బాలీవుడ్, హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉండే ప్రియాంక చోప్రా సమాజ సేవకు కూడా ప్రాధాన్యం ఇస్తుంటారు. యునిసెఫ్ ప్రచారకర్తగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారుల శ్రేయస్సుకు కృషి చేస్తుంటారు. అవకాశం వచ్చినప్పుడు అవయవ దానం పైనా అవగాహన పెంచుతుంటారు.
"అవయవ దానం ప్రాముఖ్యత తెలియక చాలామంది భయపడుతున్నారు. అవయవాలు మరొకరి ప్రాణం నిలబెడతాయని, మనం ఉన్నా లేకపోయినా వాళ్ల రూపంలో బతికే ఉండచ్చన్న విషయాలు అర్థం చేసుకుంటే భయం పోతుంది. అవయవాలు దానం చేసే వాళ్లే అసలైన హీరోలు. నేను నా మరణానంతరం నా అవయవాలన్నీ దానమివ్వాలని నిర్ణయించుకున్నా" అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
జెనీలియా
జెనీలియా కూడా అవయదానం చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. తన భర్త రితేష్‌తో కలిసి అవయవ దానంపై అవగాహన కల్పించే సదస్సులకు హాజరవుతుంటారు. సోషల్ మీడియాలో కూడా అవగాహన కల్పిస్తుంటారు. జీవితాన్నే బహుమతివ్వడం కంటే గొప్ప గిఫ్ట్ ఏదీ ఉండదని, అందుకే నేను, నా భర్త అవయవాల్ని దానమివ్వాలని నిర్ణయించుకున్నామంటూ గతంలో ఆమె పేర్కొన్నారు.
కాజల్ అగర్వాల్
'దో లఫ్జోన్ కీ కహానీ' అనే సినిమాలో కాజల్ అగర్వాల్ అంధురాలి పాత్రలో నటించారు. ఆ తర్వాత తనకు కళ్లు లేని వాళ్ల పరిస్థితి అర్థమైందని, తన రెండు కళ్లూ దానమిస్తానంటూ ప్రకటించారు. అంతేకాకుండా నేత్రదానం, కంటి ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలకు కూడా హాజరవుతుంటారు. "కంటి చూపు చాలా ముఖ్యం. అన్ని దానాల్లోకెల్లా నేత్ర దానం విలువైనదని నేను నమ్ముతా. కంటి చూపు లేని వారికి అందించే గొప్ప కానుక ఇది. అందుకే నేనూ నా మరణానంతరం నా కంటి చూపుతో ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపాలని నిర్ణయించుకున్నాను." అని కాజల్ చెప్పుకొచ్చారు.