Drishyam Franchise Hollywood Remake : దృశ్యం సిరీస్ ఓ అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన ఈ చిత్రం పలు రికార్డులను కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రీమేక్ విషయంలో మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఏకంగా హాలీవుడ్‌లో తెరకెక్కనుంది. అక్కడి నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ఇంగ్లిష్, స్పానిష్‌లలో రీమేక్ చేయనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దీంతో హాలీవుడ్‌లో రీమేక్ కానున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా దృశ్యం నిలిచింది.
ఈ చిత్రాన్ని మొదటగా మలయాళంలో రూపొందించారు. అక్కడి సూపర్ స్టార్ మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేయగా వెంకటేశ్, మీనా నటించారు. శ్రీప్రియ దర్శకత్వం వహించారు. హిందీలో అజయ్ దేవగణ్, శ్రియ నటించారు. పాపనాశం పేరుతో తమిళ్‌లో తెరకెక్కగా కమల్ హాసన్, గౌతమి నటించారు. కన్నడలో దృశ్య పేరుతో రూపొందింది. ఇలా అన్నీ భాషల్లోనూ సక్సెస్‌ను అందుకుంది.
అనంతరం తొలి భాగానికి సీక్వెల్‌గా దృశ్యం 2 రూపొందించగా ఇది కూడా విజయం సాధించింది. తెలుగులో అయితే వెంకటేశ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో ఈ సిరీస్ చిత్రాల కథలను కొరియన్‌లోనూ రీమేక్ చేశారు. అక్కడ కూడా మాతృక తరహాలోనే భారీ విజయాన్ని అందుకున్నాయి.
ఇక ఇప్పుడు హాలీవుడ్‌లో తెరకెక్కేందుకు రెడీ అయింది దృశ్యం. అక్కడ ప్రసిద్ధి చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం సిరీస్ కథలను తెరకెక్కించేందుకు రెడీ అయింది. హాలీవుడ్ ప్రేక్షకులకు అందించనుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ నుంచి ఈ చిత్రాల అంతర్జాతీయ రీమేక్ హక్కులను గల్ఫ్ స్ట్రీమ్ సంస్థ సొంతం చేసుకుంది. మరి హలీవుడ్ దృశ్యంలో నటీనటులుగా ఎవరు నటిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కాగా, త్వరలోనే దృశ్యం 3 కూడా మలయాళంలో రాబోతున్నట్లు తెలుస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">