Bollywood Actor Who Lived In Garage : అప్పటి దిలీప్ కుమార్ నుంచి ఇప్పటి అక్షయ్ కుమార్ వరకు ఎంతో మంది స్టార్ హీరోలు తమ నటనతో బీటౌన్‌ను ఓ ఊపు ఊపేశారు. పోటీ ప్రపంచంలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించి చరిత్రకెక్కారు. అయితే ఆ స్టార్స్ ఆ స్థాయికి రావడానికి ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొనుంటారు. వాటి గురించి పలు సందర్భాల్లో చెప్పుకొన్ని కంటతడి పెట్టుంటారు. అయితే ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఓ బాలీవుడ్ స్టార్, తన కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలను అనుభవించారు. అయితే వాటిన్నింటినీ ఎదుర్కొని ఆయన సక్సెస్ఫుల్ హీరోగా రాణించారు. కొన్ని దశబ్దాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలారు. ఇంతకీ ఆయనెవరో కాదు దిగ్గజ నటుడు ధర్మేంద్ర.
తన సుదీర్ఘ సినీ జర్నీలో బాలీవుడ్‌కు ఎన్నో హిట్లు ఇచ్చారు ధర్మేంద్ర. 90వ దశకం నుంచి ఇప్పటి వరకు ఆయన 306 సినిమాల్లో మెరిసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఆయన ఎన్నో కష్టాలు పడ్డారట.
కెరీర్ తొలినాళ్లలో చిన్నపాటి సపోర్టింగ్ రోల్స్ చేసిన ఆయన వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ బీటౌన్‌లో నిలదొక్కుకోవాలని అనుకున్నారట. అయితే ఆయనకు పెద్దగా సంపాదన ఉండేది కాదట. ఈ నేపథ్యంలో ఆయన ఓ గ్యారేజీలోనే ఉండేవారు. ఇక సంపాదన కోసం ఆయన అప్పుడప్పుడు ఓ డ్రిల్లింగ్ కంపెనీలో పని చేసేవారట. దానికి ఆయనకు 200 రూపాయలు వచ్చేవట. అలా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఆ డ్రిల్లింగ్ కంపెనీలోనూ పని చేసేవారట.
అలా కొంత కాలం తర్వాత 1966లో ధర్మేంద్రకు ఓ మంచి అవకాశం వచ్చింది. 'ఫూల్ ఔర్ పత్తర్' అనే సినిమాలో ఆయన కీ రోల్ ప్లే చేశారు. ఈ సినిమా మంచి టాక్ అందుకోవడం వల్ల ఆయన తన కెరీర్లో ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాకుండా పోయింది. ఇక 'షికార్', 'ఆంఖే' లాంటి బ్లాక్‌బస్టర్లతో ఆయన కెరీర్లో అనతికాలంలోనే స్టార్డమ్ పొందారు.
సోలోనే కాదు మల్టీ స్టారర్లోనూ టాప్
1968 ఏడాది ధర్మేంద్రకు మంచి విజయాలు దక్కాయి. హిందీ చిత్ర పరిశ్రమలోనే అత్యంత విజయవంతమైన చిత్రంగా నిలిచిన 'షోలే' ఆయనకు మరింత పేరును తెచ్చిపెట్టింది. 'చుప్కే చుప్కే', 'సీతా ఔర్ గీత', 'మేరా గావ్ మేరా దేశ్', 'ధరమ్ వీర్', 'యమ్లా పగ్లా దీవానా' లాంటి సినిమాలు ధర్మంద్ర కెరీర్లోనే అతిపెద్ద హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఇక ధర్మేంద్ర సోలో హీరోగానే కాకుండా అనేక మల్టీస్టారర్ చిత్రాల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు ధర్మేంద్ర. అలా తన కెరీర్లో ఇప్పటి వరకు 74 హిట్లను సాధించారు.
Dharmendra Upcoming Movies : ఎనిమిది పదుల వయసులోనూ ఆయన కుర్రాళ్లకు దీటుగా నటిస్తున్నారు. ఇటీవలే రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ అనే సినిమాలో ఆయన కీ రోల్ ప్లే చేశారు. దీంతో పాటు ఆయన మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేశారు. అందులో 'తేరీ బాతోం మే ఐసా ఉల్జా జియా' అనే సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. మరోవైపు సినీ వర్గాల సమాచారం ప్రకారం ధర్మేంద్ర ప్రతి సినిమాకు రూ. 5 కోట్ల పారితోషికం అందుకుంటున్నారట. ఈయన సన్నీ దేఓల్, బాబీ దేఓల్ ఇ ఇద్దరు కుమారులు కూడా ప్రస్తుతం బాలీవుడ్లో మంచి హిట్స్ అందుకుని సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు.