RajTarun Bhaley Unnadey : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ సినీ ప్రేక్షకులకు పరిచయమే. 'ఉయ్యాల జంపాల' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈయన తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. అలానే ఉత్తమ నటుడిగా అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 'సినిమా చూపిస్తా మామ', 'కుమారి 21 ఎఫ్' చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నా భారీ విజయాలు ఆయనకు దక్కట్లేదు! కొన్ని పర్వాలేదనిపించినా, మరికొన్ని నిరాశపరుస్తున్నాయి.
గత నెలన్నర వ్యవధిలో ఆయన మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పురుషోత్తముడు, తిరగబడరా సామీ, భలే ఉన్నాడే సినిమాలతో ఆడియెన్స్‌ను అలరించారు. అయితే వీటిలో తాజాగా రిలీజైన భలే ఉన్నాడే(సెప్టెంబర్ 13) ఒక్కటి మాత్రం పర్వాలేదనిపించే పాజిటివ్ రివ్యూను అందుకుంది. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ తాజాగా భలే ఉన్నాడే ప్రమోషన్స్‌లో పాల్గొని తాను ఇండస్ట్రీకి వచ్చిన ప్రారంభ రోజులను గుర్తుచేసుకున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ పరిశ్రమకు వచ్చినట్లు చెప్పారు. అక్కడి నుంచి తాను హీరోగా మారడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు.
"నన్ను ఎవరైనా గుర్తించాలని, ఇండస్ట్రీకి పిలవాలని చాలా కష్ట పడ్డాను. వైజాగ్ తప్ప మరో ఊరు కూడా నాకు తెలీదు. 52 షార్ట్ ఫిల్మ్‌లు తీశాను. ఆ తర్వాతే రామ్మోహన్ గారు నన్ను చూసి పిలిచారు. అప్పుడు రూ.3000కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిలో చేరాను. స్క్రిప్ట్ రాసిన తర్వాత సన్నివేశాల గురించి చర్చించేవారు. ప్రతీ సన్నివేశం ఇంకా బాగా రాస్తే బాగుండేది అని చెప్పేవాడిని. దీంతో నేనుంటే స్క్రిప్ట్ వర్క్ ముందుకుసాగదని నన్ను పంపించేశారు. దీంతో ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కాలేదు. పైగా సినిమాల్లో ఉండాలనే ఉద్దేశ్యంతో బీటెక్ కూడా వదిలేసి వచ్చా. అద్దె కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. దీంతో ఫుట్‌పాత్‌పై కూడా పడుకున్నాను. 11 రోజులు అక్కడే ఉన్నాను. ఆ తర్వాత మళ్లీ రామ్మోహన్ గారే పిలిచారు. అప్పుడు నాకు 20 ఏళ్లు ఉంటాయి. ఎలాగైనా చిత్ర పరిశ్రమలో సెటిల్ అవ్వాలనే పట్టుదలతోనే రైటర్‌గా వర్క్ చేశాను. ఆ తర్వాత హీరోగా ఛాన్స్ వచ్చింది" అని చెప్పారు.
'దళపతి 69' ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవే! - హీరోయిన్ ఎవరంటే? - Vijay Thalapathy 69