Balakrishna About His Father : నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలుగా టాప్ హీరోగా కొనసాగుతున్నారు నందమూరి బాలకృష్ణ. సినీ పరిశ్రమతో పాటు రాజకీయాలలోనూ వారసునిగా విజయకేతనం ఎగరేస్తున్న బాలయ్య బాబు టీవీ షోలలోనూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే, ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో స్ట్రీమింగ్ అయ్యే 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోలో తన తండ్రిపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని బయటపెట్టడంతో ఆయనపై ప్రజలకున్న అభిమానం రెట్టింపు అయింది.
బాలకృష్ణ చివరిసారిగా నటించిన సినిమా భగవంత్ కేసరీ. ఈ సినిమా గురించి ఆహా ఓటీటీలో దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ముచ్చటించారు. ఈ సంభాషణలో తనను గురువు గారు అని బాలకృష్ణ ఎందుకు పిలుస్తారనే సందేహాన్ని నివృతి చేసుకునే ప్రయత్నించారు అనిల్. ఈ క్రమంలోనే " మీకంటే వయస్సులో చిన్నవాడిని, ఏడో సినిమాకు దర్శకత్వం వహించాను. కానీ, సెట్స్‌లో ఉన్నప్పుడు మీరు నన్ను గురువు గారు అని పిలిచే వారు. అలా పిలవడం నాకు ఆనందాన్నిచ్చింది. ఆ స్థానానికి మీరిచ్చిన గౌరవం చూసి నేను ఫిదా అయ్యాను" అని నర్మగర్భంగా సందేహాన్ని బాలకృష్ణ ముందుంచారు అనిల్.
దానిపై రియాక్ట్ అయిన బాలయ్య "నా పాత్రకు ప్రాణం పోసే వాళ్లు తండ్రితో సమానం. డైరక్టర్ కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరినీ తండ్రితో సమానంగా భావిస్తా. ఏ దర్శకుడైనా నాకు మా నాన్నతో సమానం. అందుకే అలా పిలుస్తా" అని వివరణ ఇచ్చారు. తన తండ్రికి ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసుకుని ఎవరినైనా గౌరవించాలంటే తండ్రితో పోల్చుకుని చూసుకునే బాలయ్య సుగుణానికి అభిమానులు ఫిదా అయిపోయారు.
తెలుగు వారి గుండెల్లో వీరాభిమానం సంపాదించుకున్న బాలకృష్ణ సినీ ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తి కావొస్తుంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న అంగరంగ వైభవంగా తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఆయనను సత్కరించే కార్యక్రమం చేపట్టింది. హైదరాబాద్ లోని హైటెక్స్ నోవోటెల్ హోటల్లో జరిగే ఈ ప్రోగ్రాంకి తమిళం, మలయాళం, కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా విచ్చేయనున్నారు.
ఇదిలా ఉంటే, బాలకృష్ణ డైరక్టర్ బాబీ దర్శకత్వంలో తర్వాతి సినిమాలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ టైటిల్ NBK109తో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది.