Pottel Movie Review In Telugu
చిత్రం : పొట్టేల్;
నటీనటులు : యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు;
సంగీతం : శేఖర్ చంద్ర;
సినిమాటోగ్రఫీ : మోనిష్ భూపతి రాజు;
ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్;
పాటలు : కాసర్ల శ్యామ్;
కళ : నార్ని శ్రీనివాస్;
నిర్మాతలు : నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె;
రచన, దర్శకత్వం : సాహిత్ మోత్కూరి;
సంస్థ : నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్;
గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన 'పొట్టేల్' ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కొంతమంది సినీ ప్రముఖులు ఈ సినిమా చూసి మెచ్చుకున్నారు. తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిందీ చిత్రం. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం.
కథేంటంటే? (Pottel Movie Story) : 1970, 80వ దశకం నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కించారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గుర్రం గట్టు అనే ఊరిలో, అక్కడి గ్రామ దేవత బాలమ్మకు పుష్కరానికి ఓ సారి జాతర నిర్వహిస్తుంటారు. ప్రతి జాతరకీ పొట్టేల్‌ను బలి ఇవ్వడం అక్కడ ఆనవాయితీగా వస్తుంటుంది. కానీ రెండు సార్లు జాతరకు ముందే పొట్టేళ్లు చనిపోవడంతో, ఊరిలో కరవు తాండవిస్తుంది. దీంతో మూడోసారి రానున్న జాతరకు అమ్మవారికి బలి ఇచ్చే పొట్టేల్ సంరక్షణ బాధ్యతల్ని ఊరి యువకుడైన గంగాధరీ (యువచంద్ర కృష్ణ)కి అప్పగిస్తారు. తన బిడ్డ సరస్వతి (తనస్వి) చదువుకోసమే పరితపిస్తూ బతుకుంటాడు గంగాధరీ.
అయితే అదే ఊరిలో పటేల్ (అజయ్) ఆధిపత్యం కొనసాగుతూ ఉంటుంది. అమ్మవారు బాలమ్మ తనని పూనిందని చెబుతూ, గ్రామంలో ఎన్నో దురాగతాలకు పాల్పడుతుంటాడు పటేల్. కానీ అతడి నిజ స్వరూపం గంగాధరీకి తెలుసు. కానీ, ఊరి జనాలు గంగాధరీ మాటలు నమ్మరు. ఈ క్రమంలోనే జాతర దగ్గర పడుతున్న సమయంలో గంగాధరీ సంరక్షణలోని ఉన్న పొట్టేల్ మాయం అవుతుంది. దీంతో పటేల్‌తో పాటు, ఊరి జనం అతడిపై మండిపడతారు. అమ్మవారి పొట్టేల్‌ను తిరిగి తీసుకు రావల్సిందేనని, లేదంటే బడికెళుతున్న గంగాధరీ కూతురు సరస్వతిని బలి ఇస్తానని చెబుతాడు పటేల్. మరి తన కూతురి ప్రాణాల్ని దక్కించుకునేందుకు గంగాధరీ ఏం చేశాడు? ఈ ప్రయాణంలో గంగాధర్ భార్య బుజ్జమ్మ (అనన్య నాగళ్ల) పాత్ర ఏంటి? ఇంతకీ పొట్టేల్‌ను మాయం చేసిందెవరు? చివరికి గంగాధరీ పొట్టేల్‌ను తిరిగి తీసుకొచ్చాడా లేదా? అనేదే కథ.
ఎలా ఉందంటే ? - చదువు గొప్పతనాన్ని చెబుతూ, అప్పటికాలంలో ఓ వర్గం సాగించిన దురాగతాల్ని, ప్రజల మూఢ నమ్మకాల్ని, సమాజంలోని అసమానతల్ని కళ్లకు కడుతూ ఈ సినిమా సాగింది. కథను ఆసక్తికరంగా మలచడంలో కాస్త తడబాటు చోటు చేసుకుంది. హీరో హీరోయిన్ మధ్య ప్రేమకథ తదితర సన్నివేశాలు కాలక్షేపాన్నిస్తాయి. సెకండాఫ్ అంతగా మెప్పించలేదు. ద్వితీయార్ధంలో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపించింది. చాలా సన్నివేశాలు లాజిక్‌కి దూరంగా సాగుతుంటాయి. ప్రధాన పాత్రల్లో విలన్ పాత్ర మినహా, మిగతా ఏదీ అంత ప్రభావం చూపించదు. రచన పరంగా చిన్న సమస్యలున్నాయి. అయినప్పటికీ సినిమా బోర్ కొట్టకుండానే సాగుతుంది.
ఎవరెలా చేశారంటే ? - పటేల్ పాత్రలో అజయ్ నటన బాగుంది. ఆ పాత్ర డిజైన్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. గంగాధరీ పాత్రలో యువ చంద్ర కృష్ణ మంచి నటనను ప్రదర్శించాడు. పాత్రకి తగ్గట్టుగా అందులో అమాయకత్వం ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నాడు. బుజ్జమ్మ పాత్రలో అనన్య నాగళ్ల బానే నటించింది. ఉపాధ్యాయుడు దుర్యోధనగా శ్రీకాంత్ అయ్యంగార్ మెప్పించారు.
సాంకేతిక విషయాలకొస్తే సంగీతం, కెమెరా విభాగాలు మంచి పనితీరుని చూపించాయి. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చిత్రంపై ప్రభావం చూపించాయి. ఎడిటింగ్ పరంగా చాలా లోపాలు కనిపించాయి. నిర్మాణంలో లోటుపాట్లేమీ కనిపించలేదు.
చివరిగా : పొట్టేల్, ఉద్దేశం బాగుంది.
ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
'పుష్ప పార్ట్ 3' కన్ఫార్మ్ - ప్రొడ్యూసర్ సెన్సేషనల్ అనౌన్స్మెంట్
OTTలోకి ఒక్కరోజే 6 సినిమాలు - ఆ 11 మంది అమ్మాయిలను చంపిన సీరియల్ కిల్లర్ మూవీ కూడా!