Alia Bhatt Rare Disease : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తాజాగా తనకున్న ఓ సమస్య గురించి వివరించింది. ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు కాస్త ఆందోళనకు గురవుతూ ఉంటుందట. ప్రతి క్షణం ఆందోళన, ప్రతిదానికీ మనసులో ఏదో తెలియని గందరగోళం ఉంటుందంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ సమస్య విషయంలో తనకు భర్త రణ్‌బీర్ కపూర్ సపోర్ట్ ఎంతో ఉంటుందంటూ ఆలియా చెప్పుకొచ్చింది. కరీనా కపూర్ నిర్వహిస్తున్న స్పెషల్ పోడ్కాస్ట్ షోలో ఆలియా ఈ విషయాన్ని బయటపెట్టింది.
"రాహా పుట్టాక తన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకోకపోతే జనాలు ఏమనుకుంటారో అని అనుకునేదాన్ని. ఈ విషయంలో నాకు కాస్త అసౌకర్యంగానూ ఉండేది. ఎందుకంటే ఆమె చాలా చిన్న పాప. తను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ కాకూడదని నా అభిప్రాయం. అయితే 2023 క్రిస్మస్ టైమ్‌లో లంచ్ చేద్దామని మేమందరం కారులో బయలుదేరాం. అప్పుడు రణ్‌బీర్ 'మనం రాహాతో కలిసి ఈ రోజు ఫొటో దిగుదామా' అని అడిగారు. అప్పుడు నేను ఒక్కసారిగా కంగారుపడ్డాను.
'నువ్వు నిజంగా అంటున్నావా' అని నేను అన్నాను. ఎందుకంటే నాకెందుకో ఆ మాట నాకు ఆందోళనగా అనిపించింది. ప్రతి క్షణం అలాగే అనిపిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు అది మరింత తీవ్రంగా ఉంటుంది. అయితే అప్పుడు నా పరిస్థితిని రణ్‌బీర్ బాగా అర్థం చేసుకున్నాడు. వేరే విషయాల గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. బాంద్రా, జుహూ అంటూ టాపిక్ ఛేంజ్ చేసి ఏదో ఒకటి మాట్లాడేవారు. ఇదంతా జీవితంలో ఒక భాగమని కొన్నాళ్ల తర్వాత నాకూ అర్థమైంది" అని చెప్పుకొచ్చింది.
'రెండేళ్లవరకూ నేను అలా చేయను'
రణ్‌బీర్- ఆలియా గతేడాది ఏప్రిల్ 14న గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. ముంబయిలో అత్యంత సన్నిహితులు, కొద్దిమంది సెలబ్రెటీల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. కాగా వీరిద్దరూ 2022 నవంబర్ 6న పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందారు. వీరికి రాహా జన్మించింది. అప్పటి నుంచి వీరిద్దరు చిన్నారి పేరు గురించి తప్ప మరే సమాచారాన్ని బయటపెట్టలేదు. పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోల్లో చిన్నారి ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.
అయితే రాహా ఫేస్ చూపాలంటూ నెటిజన్లు గతంలో సోషల్ మీడియాలో కోరగా, ఆలియా స్పందించింది. 'రాహాకు రెండేళ్లు వచ్చేంతవరకు ఆమెకు సంబంధించిన ఎటువంటి ఫొటోలను షేర్ చేయము. మేము ఏదైనా ఈవెంట్లో కనిపిస్తే ఫొటోగ్రాఫర్లు కూడా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి' అని అప్పట్లో ఆలియా ఓ సందర్భంలో తెలిపింది.