Man Built Tunnel : కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు ఒక్కరి సహాయం కూడా లేకుండా స్వయంగా భారీ భూగర్భ సొరంగాన్ని నిర్మించారు. మరికొద్ది రోజుల్లో తన లక్ష్యాన్ని పూర్తి చేయనున్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటూ తాను అనుకున్నది సాధించేందుకు శ్రమిస్తున్నారు. అది కూడా కొండప్రాంతమైన తన గ్రామంలో సొరంగాన్ని నిర్మిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.
అక్కడ చూసి వచ్చి!
జిల్లాలోని పెరువాంబ గ్రామానికి చెందిన థామస్ కొన్నేళ్ల క్రితం తన ఇద్దరి పిల్లలతో కలిసి థాయ్‌లాండ్ వెళ్లారు. అక్కడి సొరంగమార్గాలను చూసి ఆశ్యర్చపోయారు. అవి ఆయనలో స్ఫూర్తినింపాయి. దీంతో తాను కూడా సొరంగం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. థాయ్‌లాండ్ నుంచి వచ్చాక తన ఇంటి సమీపంలో సొరంగ నిర్మాణ పనులు ప్రారంభించారు. తన 75 సెంట్ల స్థలంలో 100 మీటర్ల సొరంగాన్ని నిర్మించాలనే లక్ష్యంతో 2021లో ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టారు.
రోజుకు 14 గంటలపాటు!
ఇప్పటి వరకు 88 మీటర్ల సొరంగాన్ని పూర్తి చేశారు. అనేకసార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా థామస్ నిర్మించిన సొరంగం చెక్కుచెదరలేదు. ఎలాంటి డ్యామేజ్‌కు గురికాలేదు. 70 ఏళ్ల వయసులో కూడా ఎవరి సహాయం లేకుండానే నిర్మించారు థామస్. సొరంగం నిర్మాణం కోసం రోజుకు 14 గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేశారు. సొరంగం నుంచి మట్టిని ఒక్కరే బయటకు తరలించారు.
వయనాడ్ ప్రజలంతా!
ఆ మధ్య గుండె జబ్బు బారినపడడం వల్ల నిర్మాణ వేగాన్ని తగ్గించారు థామస్. త్వరలోనే తన లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. థామస్ ఇంటి సమీపంలోని రెండు గేట్ల ద్వారా సొరంగంలోకి చేరుకోవచ్చు. 6 నుంచి 9 అడుగుల ఎత్తులో ఉన్న సొరంగాన్ని చూసేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. కాసర్‌గోఢ్, వయనాడ్‌కు చెందిన అనేక మంది ప్రజలు, థామస్ నిర్మించిన సొరంగాన్ని చూసి వెళ్లారు.
నిజంగా ఆశ్యర్చకరం!
70 ఏళ్ల వయసులో ఒక వ్యక్తి ఎవరి సహాయం లేకుండా భారీ సొరంగం నిర్మించడం ఆశ్చర్యకర విషయమని కాసర్‌గోఢ్ జిల్లా మాజీ ఉపాధ్యక్షురాలు శాంతమ్మ ఫిలిప్ తెలిపారు. ఎలా నిర్మించారో తెలుసుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుందన్నారు. అయితే సొరంగ నిర్మాణం కోసం కొన్ని లక్షల రూపాయల విలువైన పనిముట్లును కొనుగోలు చేశానని థామస్ తెలిపారు. పూర్తి నిర్మాణం అయ్యాక లైటింగ్ కోసం వెచ్చించాల్సి ఉందని చెప్పారు.