Competitive Exam Success Tips : పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికావడం సహజమే. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే, ముందు నుంచే ఒక పక్కా ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి. ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవాలి. అవసరాన్ని బట్టి కొన్ని విషయాలను కంఠస్తం చేయాలి. ఉదాహరణకు తేదీలు, ఫార్ములాలు లాంటి వాటిని కంఠస్తం చేయాలి. అప్పుడే పరీక్షలు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాయగలుగుతాము.
మనం ఎంత చదివినప్పటికీ పరీక్ష హాలులో కూర్చున్న తరువాత, కొంత కంగారుగా ఉండడం సహజం. అందుకే ఈ ఆర్టికల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అకడమిక్ లేదా పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు కావాల్సిన సూపర్ చిట్కాలను తెలుసుకుందాం.
టిప్ 1 : పరీక్ష ప్రారంభమైనప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మీరు బాగా చదువుకున్న ఫార్ములాలు, తేదీలు, పదాలు, భావనలు లాంటి వాటిని ఒక చిత్తు ప్రతి (రఫ్ పేపర్)పై రాసుకోవాలి. పరీక్షకు ముందే మీరు తయారు చేసుకున్న మైండ్ మ్యాప్స్, SQ3R (సర్వే, క్వశ్చన్, రీడ్, రిసైట్, రివ్యూ) మెథడ్స్ను గుర్తు తెచ్చుకోవాలి. దీని వల్ల మీరు ఎలాంటి టెక్షన్ లేకుండా, పరీక్ష రాయగలుగుతారు. ఇది హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్లు చెప్పిన మంచి చిట్కా.
టిప్ 2 : పరీక్ష ప్రారంభమైన తర్వాత క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని ఒకసారి క్షుణ్ణంగా చదవాలి. మొదటిగా మీకు బాగా సమాధానం తెలిసిన వాటిని మాత్రమే రాయాలి. తరువాత మీకు కాస్త జవాబులు తెలిసిన ప్రశ్నలను ఎంచుకోవాలి. తరువాత మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు రాసే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల సమయం వృథా కాకుండా ఉంటుంది. పరీక్షలో మంచి మార్కులు సాధించే అవకాశం పెరుగుతుంది. ఎలా అంటే, పేపర్ దిద్దే వాళ్లు, మొదటి ప్రశ్నకు మీరు రాసే సమాధానాన్ని బట్టి, ఒక ప్రత్యేకమైన ఇంప్రెషన్ ఏర్పరుచుకుంటారు. కనుక మొదట్లో మీరు చక్కగా, సరైన సమాధానాలు రాస్తే, వాళ్లు ఇంప్రెస్ అయ్యి, మంచి మార్కులు వేసే అవకాశం ఉంటుంది.
టిప్ 3 : నెగిటివ్ మార్కులు ఉంటే మాత్రం, తెలియని ప్రశ్నలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు సమాధానాలు రాయవద్దు.
టిప్ 4 : పరీక్షల్లో విజయం సాధించాలంటే టైమ్ మేనేజ్మెంట్ తప్పనిసరి. మీరు ఆన్లైన్లో లేదా కంప్యూటర్లో పరీక్ష రాస్తే, టైమ్ ఎంత అవుతుందో తెలుస్తుంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో పరీక్ష రాస్తుంటే, చేతిగడియారాన్ని కచ్చితంగా ఉపయోగించాలి. ఒకవేళ హ్యాండ్వాచ్ను అనుమతించకపోతే, పరీక్ష నిర్వహకులను అడిగి ఎప్పటికప్పుడు టైమ్ తెలుసుకుంటూ ఉండాలి.
టిప్ 5 : పరీక్షలంటే ఎవరికైనా కాస్త కంగారుగానే ఉంటుంది. దీనిని అధిగమించాలంటే, పరీక్ష రాసే ముందు కొద్దిసేపు ధ్యానం (మెడిటేషన్) చేయడం మంచిది. ఇలా చేస్తే మైండ్ రిలాక్స్ అయ్యి, ఎలాంటి అనవసర ఒత్తిడి లేకుండా పరీక్ష రాయగలుగుతారు. పరీక్షలో విజయం సాధించగలుగుతారు. చూశారుగా! ఈ సింపుల్ చిట్కాలు పాటించించి పరీక్షలో విజయం సాధించండి. ఆల్ ది బెస్ట్!