Arts Students Career Options : ఐఐటీలో చేరడం అనేది ఇంజనీరింగ్ చదవాలనుకొనే ప్రతీ భారతీయ విద్యార్థి కల. ఐఐటీలో సీటు సాధించాలని ప్రత్యేకంగా కోచింగ్ కూడా తీసుకుంటారు. అంతలా వీటికి దేశంలో ప్రాధాన్యం ఉంది. మన దేశంలోని టాప్ ఐఐటీల్లో చదివినవారు కనీసంగా రూ.20 లక్షల నుంచి రూ.1 కోటి వరకు వార్షిక వేతనాన్ని పొందుతున్నారు. అందుకే ఐఐటీల్లో చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తుంటారు. ఐఐటీల్లో చదివితే మంచి సాలరీతో ఉద్యోగం వస్తుంది. కెరీర్‌కు కూడా గ్యారెంటీ ఉంటుందని భావిస్తుంటారు. అయితే భారత్‌లో సైన్స్ గ్రూపులు చదివినవారు ఐఐటీల్లో ప్రవేశం కోసం ప్రయత్నిస్తుంటారు. దీనికి కారణం చాలా మంది ఐఐటీల్లో కేవలం సైన్స్ బ్రాంచ్లే ఉంటాయని అనుకుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. ఆర్ట్స్ (హ్యుమానిటీస్) కోర్సులు కూడా ఐఐటీల్లో ఉన్నాయి. ఇంటర్లో ఆర్ట్స్ చదివినవారు, ఈ ఐఐటీల్లో సీటు సాధించి ఈ కోర్సులను చేయవచ్చు. ఆ కోర్సులు ఏమిటి? దేశంలోని ఏయే ఐఐటీల్లో ఆ కోర్సులు ఉన్నాయి? తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఐటీ దిల్లీ, ఐఐటీ గువాహటి, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్‌పుర్‌లో నాన్-సైన్స్, ఆర్ట్స్ (హ్యూమానిటీస్), సోషల్ సైన్సెస్ కోర్సులు ఉన్నాయి. అలాగే భాషా శాస్త్రం, సాహిత్యానికి సంబంధించిన కోర్సులు కూడా ఇవి అందిస్తున్నాయి.
1. ఐఐటీ దిల్లీ
దేశంలో ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో ఐఐటీ దిల్లీ ఒకటి. ఇందులో డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం పలు ఆర్ట్స్ కోర్సులు అందిస్తోంది. అవి: ఆర్థిక శాస్త్రం, భాషా శాస్త్రం, సాహిత్యం, ఫిలాసఫీ, తత్వశాస్త్రం, సైకాలజీ, సోషియాలజీ కోర్సులు.
2. ఐఐటీ గువాహటి
ఐఐటీ గువాహటిలో హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ విభాగం - ఆర్థిక శాస్త్రం, ఆంగ్లం, భాషాశాస్త్రం, తత్వశాస్త్రం, సైకాలజీ, సోషియాలజీ, హిస్టరీ, ఆర్కియాలజీ, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ, డెవలప్మెంట్ స్టడీస్ వంటి ఆర్ట్స్ కోర్సులను అందిస్తోంది.
3. ఐఐటీ మద్రాస్
ఐఐటీ మద్రాస్‌లోనూ ఆర్ట్స్ కోర్సులు ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ - డెవలప్మెంట్ స్టడీస్, ఎకనామిక్స్, ఇంగ్లీష్ స్టడీస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, హిస్టరీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ లాంటి ఆర్ట్స్ కోర్సులను అందిస్తోంది.
4. ఐఐటీ ఖరగ్‌పుర్
ఐఐటీ ఖరగ్‌పుర్ మొదటి (1951) నుంచే హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ కోర్సులు అందిస్తోంది. ఆంగ్ల భాషా శాస్త్రం & సాహిత్యం, ఆర్థిక శాస్త్రం, జర్మన్, సైకాలజీ, హెచ్ఆర్, హిస్టరీ, సంస్కృతం, సోషియాలజీ వంటి అనేక కోర్సులను ఐఐటీ ఖరగ్‌పుర్ అందిస్తోంది. అంతేకాదు ఎంఎస్ ఇన్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఇన్ ఎకనామిక్స్, మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ (MHRM), పీహెచ్డీ కోర్సులు కూడా ఇక్కడ ఉన్నాయి.
ఐఐటీలు హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ కోర్సులను ఎందుకు అందిస్తున్నాయి?
మంచి ఆలోచనా సామర్థ్యం సహా, సమస్యల పరిష్కార నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంచేందుకు ఐఐటీలు ఈ కోర్సులను అందిస్తున్నాయని ఓ సీనియర్ ప్రొఫెసర్ తెలిపారు. కనుక అర్హత, ఆసక్తి ఉన్న ఆర్ట్స్ విద్యార్థులు ఈ కోర్సులను ఎంపిక తమ భవితను తీర్చిదిద్దుకోవచ్చు.