పదో తరగతి పరీక్ష ఫలితాలు బిగ్ అప్‌డేట్- అన్నీ అనుకూలిస్తే 25నే రిజల్ట్స్
AP SSC Results 2024:ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరైన విద్యార్ధిని, విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది విద్యాశాఖ. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల చివరి వారం అంటే ఏప్రిల్ 25నుంచి 30లోపు ప్రకటించనుంది. విద్యార్థులు ఎస్‌ఎస్‌సీ బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్‌ను పరీక్ష ఫలితాలపై ఈటీవీ భారత్ ప్రతినిధి సంప్రదించారు. గతేడాది మే-6న ఫలితాలు వెల్లడించామని అంతకంటే ముందే ఈ సంవత్సర వార్షిక ఫలితాలు వెల్లడిస్తామని డైరెక్టర్ దేవానంద్ చెప్పారు.
ఇవి చదవండి: ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్ - రిజల్ట్స్ చూసుకోండిలా
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి18 నుంచి మార్చి 30 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించారు. ఈ వార్షిక పరీక్షలకు వ్యాప్తంగా దాదాపు 6,30,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. 3473 పరీక్షా కేంద్రాల్లో విద్యార్ధులు పరీక్షలు రాశారు. పరీక్షల ప్రక్రియ ముగియగానే అధికారులు సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభించి ఏప్రిల్ 8తేదీతో ముగించారు. జవాబుపత్రాలను మరోసారి పరిశీలించి, మార్కుల నమోదు, కంప్యూటీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఇదంతా పూర్తి చేసేందుకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్ తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. పరీక్ష ఫలితాల విడుదలకు కూడా ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. అధికారులైతే ఏప్రిల్ చివరి వారంలో విడుదలకు సిద్ధం అయ్యారు. ఒకవేళ ఎన్నికల సంఘం నుంచి అనుమతులు రావడం ఆలస్యమైతే మే మొదటి వారం ఫలితాలు గ్యారెంటీగా విడుదల చేస్తారు.
ఇక్కడ చెక్ చేసుకోండి:
అధికారులు అధికారికంగా పరీక్షా ఫలితాలు విడుదల చేసిన తర్వాత విద్యార్ధుల తల్లిదండ్రులు స్వయంగా చెక్ చేసుకునే ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 6.3లక్షల విద్యార్ధుల తల్లిదండ్రులు సులువుగా చెక్ చేసుకునేలా సాంకేతికపరమైన ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. హాల్‌టికెట్ నెంబర్‌ను నమోదు చేసి https://bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. 10వ మార్కుల మెమోను కూడా ఈ అధికారిక వెబ్‌సైట్‌ల నుంచి తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోగలరు. విద్యార్ధులు ఫలితాల ప్రకటన తర్వాత కొన్ని రోజులకు చదువుకున్న పాఠశాలల నుంచి అధికారిక ధృవపత్రాలను పొందాలి. మార్క్ షీట్ గ్రేడ్స్‌గా ఉంటుంది. ఎక్కడా ఏ సబ్జెట్‌లో ఎన్ని మార్కులు వచ్చాయన్న వివరాలు ఉండవు.
ఇవి చదవండి: త్వరలో తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల