YouTube Revenue : ప్రస్తుత రోజుల్లో యూట్యూబ్ తెలియనివారు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరి మొబైల్లో తప్పక ఉండే యాప్‌లలో యూట్యూబ్ ఒకటి. అందుకే యూట్యూబ్‌కు భారీగా ఆదాయం సమకూరుతోంది. యూట్యూబ్ వార్షిక ఆదాయం కొన్ని దేశాల జీడీపీ కంటే ఎక్కువగా ఉంది. అలాగే ప్రపంచంలో ఉన్న అగ్రస్థాయి కంపెనీల కన్నా యూట్యూబే ఎక్కువ సంపాదిస్తోంది. అందుకే ఈ స్టోరీలో యూట్యూబ్ వార్షిక ఆదాయం ఎంత? ఆదాయ వనరులు ఏమిటి? తదితర విషయాలు తెలుసుకుందాం.
ఏడాదికి 43 బిలియన్ డాలర్ల ఆదాయం
యూట్యూబ్ ప్రస్తుతం గూగుల్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ యాప్ 2023లో 43 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఎక్కువగా యాడ్స్, ప్రీమియం సబ్స్క్రిప్షన్, మ్యూజిక్, టీవీ వంటి సర్వీసుల నుంచే యూట్యూబ్‌కు ఆదాయం వస్తుంది. అంటే రోజుకు సుమారు 118 మిలియన్ డాలర్లు లేదా నిమిషానికి 82,000 డాలర్ల సంపద యూట్యూబ్‌కు వస్తోంది.
ఫ్రీ కంటెంట్- అయినా భారీగానే ఆదాయం
యూజర్లకు ఉచితంగా కంటెంట్‌ను యూట్యూబ్ అందిస్తోంది. అయినప్పటికీ ఇతర సర్వీసుల ద్వారా యూట్యూబ్ భారీగానే ఆదాయాన్ని ఆర్జిస్తోంది. స్పాటిఫై, హులూ, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్, మ్యాక్స్ కంటే 300 శాతం అధిక ఆదాయాన్ని యూట్యూబ్ పొందుతోంది.
- నెట్‌ఫ్లిక్స్ - 33.7 బిలియన్ డాలర్లు
- స్పాటిఫై - 14.3 బిలియన్ డాలర్లు
- అమెజాన్ ప్రైమ్ వీడియో - 14 బిలియన్ డాలర్లు
- హులూ - 11.2 బిలియన్ డాలర్లు
- డిస్నీ ప్లస్ - 8.4 బిలియన్ డాలర్లు
- మ్యాక్స్ - 7.7 బిలియన్ డాలర్లు
కోకా కోలాతో సమానంగా ఆదాయం
ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన కొన్ని కంపెనీల కంటే కూడా యూట్యూబ్ ఎక్కువ ఆదాయాన్ని గడిస్తోంది. ఉదాహరణకు కోకా కోలా కంపెనీ కూడా 2023లో 43 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. డ్యుయిష్ బ్యాంక్ 42.3 బిలియన్ డాలర్లు, టెక్ దిగ్గజం ఒరాకిల్ 42.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందాయి. వీటి కన్నా యూట్యూబ్ ఎక్కువ రాబడిని సాధించింది. స్టార్‌బక్స్, కాంటినెంటల్, షావోమీ, మాస్టర్‌కార్డ్, పేపాల్, అడోబ్ కంటే యూట్యూబ్ ఎక్కువ రెవెన్యూ పొందుతోంది.
నేపాల్, మొనాకో జీడీపీ కన్నా 5 రెట్లు అధికం
ప్రపంచంలోని పలు దేశాల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) కంటే యూట్యూబ్ రెవెన్యూ ఎక్కువగా ఉండడం గమనార్హం. లాట్వియా, బహ్రెయిన్, పరాగ్వే వంటి దేశాల జీడీపీ కన్నా యూట్యూబ్ సంపాదన అధికం. అలాగే నేపాల్, మాలి, మాల్టా, మొనాకో కన్నా యుట్యూబ్ ఆదాయం 5 రెట్లు ఎక్కువగా ఉంది.