When Car Involved in Accident to Follow Tips : కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అయినా కొన్ని సార్లు యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఈ సమయంలో కొన్ని పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. దానివల్ల ఇతరుల ప్రాణాలు రక్షించడంతోపాటు.. మీ కారు(Car)కు జరిగిన నష్టాన్నీ కవర్ చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇంతకీ.. ఆ జాగ్రత్తలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కారును డ్రైవ్ చేయవద్దు : ప్రమాదం జరిగితే మీరు చేయాల్సిన మొదట పని ఏంటంటే.. కారును డ్రైవ్ చేయడం ఆపడం. ఇది చట్టబద్ధమైన చర్య. అంతేకానీ.. అక్కడి నుంచి పారిపోకూడదు. అలా చేశారంటే పోలీసులు మీపై చర్యలు తీసుకుంటారు. హిట్ అండ్ రన్ కేసులో భారీ జరిమానా, జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పారిపోవద్దు. ఆ తర్వాత ఇంజిన్ ఆఫ్ చేసి వార్నింగ్ లైట్స్ ఆన్ చేయాలి. మీ దగ్గర ఏదైనా యాక్సిడెంట్ సింబల్ బోర్డులు ఉంటే వాటిని రోడ్డుపై పెట్టండి.
అందరూ సేఫ్‌గా ఉన్నారో లేదో చూడాలి : చాలా మంది యాక్సిడెంట్ జరగగానే షాక్‌కు గురవుతారు. ఆ టైమ్‌లో వారికి అయిన గాయాలనూ గుర్తించలేని స్థితిలో ఉంటారు. కాబట్టి.. మీ కారులోని వారితోపాటు ఎదుటివారి వాహనంలోని వారందరూ క్షేమంగా ఉన్నారా లేదా చెక్ చేయాలి. ఎవరికైనా గాయాలుంటే అత్యవసర సహాయానికి కాల్ చేసి ప్రథమ చికిత్స అందేలా చూడండి. అది పోలీసు లేదా అంబులెన్స్ కావచ్చు. అలాగే.. ఎవరూ గాయపడకపోతే మీరు ప్రమాదాన్ని 24 గంటలలోపు నాన్-ఎమర్జెన్సీ నంబర్(101) ద్వారా పోలీసులకు తెలియజేయాలి.
కారు ఇండికేటర్స్ సరిగానే వేస్తున్నారా? - అలా చేస్తే యాక్సిడెంటే!
నష్టాన్ని అంచనా వేయండి : ఆ తర్వాత వాహనాలను తనిఖీ చేయడం. కారుకు ఎంత నష్టం జరిగిందో గమనించాలి. మీ ఫోన్‌తో వీలైనన్ని ఫొటోలు తీసుకోవాలి. ఎదుటి కారు వివరాలను కూడా తీసుకోవాలి. మోడల్, రిజిస్ట్రేషన్ నంబర్, రంగుతో సహా నోట్ చేసుకోవాలి. ప్రమాద ప్రదేశం, వాతావరణ పరిస్థితులు, ప్రమాదం జరిగిన సమయాన్ని రాసుకోవాలి. మీరు కారులో తీసుకెళ్లిన వస్తువులు దెబ్బతిన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవాలి.
ఎక్స్ఛేంజ్ డీటెయిల్స్ : ఎదుటి కారు డ్రైవర్ ఫోన్ నంబర్, చిరునామా, బీమా వివరాలను తెలుసుకోండి. మీ వివరాలు ఇవ్వండి. అంతేగానీ.. ప్రమాదానికి మీరే కారణమని అంగీకరించవద్దు. ఇది బీమా కంపెనీలే నిర్ణయిస్తాయి. అదేవిధంగా.. సంఘటన స్థలంలో ఉన్న సాక్షులు, అత్యవసర సేవల సిబ్బంది ID నంబర్‌లతో సహా పాల్గొన్న ప్రతీ ఒక్కరి పేర్లను నోట్ చేసుకోవాలి.
మీ బీమా కంపెనీకి చెప్పండి : చివరగా.. ప్రమాదం తర్వాత ఎవ్వరికీ గాయాలు కాలేదని నిర్ధారించుకొని లేదా వైద్యసాయం అవసరమైన వారిని హాస్పిటల్‌కి తరలించాక మీ బీమా కంపెనీకి యాక్సిడెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలి. ఇలా వెంటనే కాల్ చేయడం ద్వారా మీ క్లెయిమ్‌ను వీలైనంత త్వరగా నమోదు చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. మీ బీమా కంపెనీ పని చేసే సమయంలో కాకుండా మిగతా టైమ్‌లో ప్రమాదం జరిగితే మీరు సహాయం కోసం రికవరీ లైన్‌కు కాల్ చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోండి.