What Is GST Return : జీఎస్టీ - ఈ పదం అందరికీ తెలిసిందే. జీఎస్టీ అంటే వస్తు, సేవల పన్ను. కేంద్ర ప్రభుత్వం 2017 జులైలో జీఎస్టీని అమల్లోకి తెచ్చింది. అంతేకాదు జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయడాన్ని కూడా తప్పనిసరి చేసింది. ఇంతకూ జీఎస్టీ రిటర్న్స్ అంటే ఏమిటి? దీనిని ఎవరు ఫైల్ చేయాలి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జీఎస్టీ రిటర్న్స్ అంటే ఏమిటి?
వ్యాపారం చేసే వ్యక్తులు లేదా సంస్థలు - వస్తు, సేవల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు, ఖర్చులు, చేసిన అమ్మకాలు, పొందిన ఆదాయం మొదలైన వివరాలను ఆదాయ పన్ను శాఖవారికి తెలియజేయాలి. దీనినే సింపుల్‌గా జీఎస్టీ రిటర్న్‌లను దాఖలు చేయడం అంటారు. దీనిని జీఎస్టీ-నమోదిత పన్ను చెల్లింపుదారులు (GSTIN) అందరూ కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ఒక వ్యాపార సంస్థ లేదా వ్యాపారి ప్రభుత్వానికి ఎంత పన్ను చెల్లించాలనేది నిర్ణయిస్తారు.
జీఎస్టీ రిటర్న్స్ నాలుగు భాగాలుగా ఉంటుంది :
1. కొనుగోళ్లు : పన్ను చెల్లింపుదారు చేసిన కొనుగోళ్ల వివరాలు
2. అమ్మకాలు : వ్యాపారి లేదా సంస్థ చేసిన విక్రయ లావాదేవీల రికార్డులు
3. అవుట్‌పుట్ GST (అమ్మకాలపై) : సప్లై చేసిన వస్తు, సేవలపై వసూలు చేసిన పన్ను
4. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (కొనుగోళ్లపై చెల్లించిన GST) : కొనుగోళ్లపై చెల్లించిన జీఎస్టీ కోసం క్రెడిట్ క్లెయిమ్
మీరు జీఎస్టీ ఫైలింగ్ చేసేందుకు క్లియర్ జీఎస్టీ సాఫ్ట్వేర్ ఉపయోగించవచ్చు. ఇది టాలీ, బిజీ, కస్టమ్ ఎక్సెల్ షీట్స్ వంటి పలు ఈఆర్పీ సిస్టమ్స్ నుంచి డేటాను తీసుకుని ప్రాసెస్ చేస్తుంది. టాలీ యూజర్లు డెస్క్‌టాప్ యాప్ ద్వారా నేరుగా తమ జీఎస్టీ డేటాను క్లియర్ జీఎస్టీ సాఫ్ట్‌వేర్‌లోకి అప్లోడ్ చేయవచ్చు. జీఎస్టీ రిటర్నులను కూడా ఫైల్ చేయవచ్చు.
జీఎస్టీ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేయాలి?
ఒక బిజినెస్ వార్షిక టర్నోవర్ ఆధారంగా, జీఎస్టీ రిటర్నులు ఏ విధంగా ఫైల్ చేయాలో నిర్ణయం అవుతుంది.
- రూ.5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారం అయితే, ఒక సంవత్సరంలో 25 రిటర్న్‌లను ఫైల్ చేయాలి. అంటే నెలవారీగా 2 రిటర్న్‌లు (GSTR-1 GSTR-3B); అలాగే ఒక వార్షిక రిటర్న్ (GSTR-9) దాఖలు చేయాలి.
- రూ.5 కోట్లలోపు టర్నోవర్ ఉన్న వ్యాపారం అయితే, QRMP స్కీమ్ కింద సంవత్సరానికి 9సార్లు రిటర్నులు దాఖలు చేయవచ్చు.
- కాంపోజిషన్ డీలర్స్ అయితే సంవత్సరానికి 5 సార్లు జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయాలి.
జీఎస్టీ రిటర్న్‌ల రకాలు:
ట్యాక్స్ పేయర్స్ కేటగిరీలను బట్టి మొత్తంగా 13 రకాల GST రిటర్న్‌లు ఉన్నాయి. వాటిలో GSTR-1, GSTR-3B, GSTR-4, GSTR-5, GSTR-5A, GSTR-6, GSTR-7, GSTR-8, GSTR-9, GSTR-10, GSTR-11, CMP-08, ITC-04. వార్షిక టర్నోవర్ రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఉన్న పన్ను చెల్లింపుదారులు అదనంగా GSTR-9Cను కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది.