Gratuity Rules : ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ తమకు చెందాల్సిన బెనిఫిట్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. సాధారణంగా ఉద్యోగులకు నెలవారీ జీతంతోపాటు, ప్రావిడెంట్ ఫండ్, డియర్నెస్ అలవెన్స్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్ సహా కొన్ని ఎర్నెడ్ లీవ్స్ ఉంటాయి. మహిళలు అయితే ప్రత్యేకంగా మెటర్నిటీ సెలవులు కూడా ఇస్తారు. ఈ బెనిఫిట్స్‌లో అత్యంత ముఖ్యమైనది గ్రాట్యుటీ. దీని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
గ్రాట్యుటీ ఎవరికి వస్తుంది?
Gratuity Eligibility : ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఉద్యోగులు ఒక సంస్థలో 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తే, వారు గ్రాట్యుటీ పొందేందుకు అర్హులు అవుతారు. వాస్తవానికి మీరు కొత్త కంపెనీలో చేరిన ప్రతిసారీ, మీ కాస్ట్-టు-కంపెనీ (సీటీసీ)లో కొంత భాగం గ్రాట్యుటీకి జమ అవుతుంది. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం-1972 ప్రకారం, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు అందరూ గ్రాట్యుటీ పొందడానికి అర్హులు అవుతారు. గ్రాట్యుటీ పొందే విషయంలో వీరి మధ్య ఎలాంటి భేదం ఉండదు.
చాలా కంపెనీలు 62 ఏళ్ల వయస్సులో రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించడంలేదు. దీనితో ఇటీవల అలహాబాద్ హైకోర్టు 'గ్రాట్యుటీ' చెల్లింపునకు సంబంధించి కీలకమైన తీర్పును వెలువరించింది. దీని ప్రకారం, ఏ ఉద్యోగి అయినా తనకు నచ్చిన (60 లేదా 62 ఏళ్ల) వయస్సులో పదవీ విరమణ చేయవచ్చు. వారికి కంపెనీలు కచ్చితంగా గ్రాట్యుటీ చెల్లించాల్సిందే.
పేమెంట్ అండ్ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం, దేశంలోని అన్ని కంపెనీలు, ఫ్యాక్టరీలు, గనులు, చమురు క్షేత్రాలు, ఓడరేవులు, రైల్వేలు తమ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాల్సిందే. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఒక కంపెనీ లేదా షాపులో 10 లేదా అంత కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉండాలి. అప్పుడే వాళ్లు గ్రాట్యుటీ ప్రయోజనం పొందడానికి అర్హులు అవుతారు.
గ్రాట్యుటీ ఎంత వస్తుంది?
Gratuity Percentage : పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్-1972 ప్రకారం, ఒక ఉద్యోగి బేసిక్ సాలరీలో 4.81 శాతాన్ని గ్రాట్యుటీ కింద ఇస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి సంవత్సరానికి రూ.5,00,000 వరకు జీతం తీసుకుంటున్నట్లు అయితే, అతను 4.81 శాతం గ్రాట్యుటీకి అర్హుడు అవుతాడు. అప్పుడు అతనికి మొత్తంగా రూ.24,050 గ్రాట్యుటీగా అందుతుంది. అంటే సదరు ఉద్యోగి నెలకు దాదాపు రూ.2,000 వరకు గ్రాట్యూటీ పొందినట్లు లెక్క.
గ్రాట్యుటీని ఎలా లెక్కిస్తారు?
How To Calculate Gratuity : ఉద్యోగి జీతం, డియర్నెస్ అలవెన్స్ (DA) ఆధారంగా గ్రాట్యుటీ లెక్కిస్తారు. వాస్తవానికి ఉద్యోగి సంపాదించిన గ్రాట్యుటీ మొత్తం, అతని సర్వీస్ కాలం, చివరిసారిగా వచ్చిన జీతం ఆధారంగా నిర్ధరణ అవుతుంది. గ్రాట్యుటీ చట్టం-1972 పరిధిలోకి వచ్చే కంపెనీలు నెలకు 26 రోజులుగా పరిగణించి గ్రాట్యుటీని లెక్కించాల్సి ఉంటుంది. ఒక ఉద్యోగి సంవత్సరం పాటు కంపెనీలో పనిచేస్తే, అతనికి 15 రోజులకు ఒకసారి చొప్పున గ్రాట్యుటీ చెల్లించాల్సి ఉంటుంది.
గ్రాట్యుటీ ఫార్ములా
Gratuity Formula : ఉద్యోగి చివరిగా డ్రా చేసిన జీతం (బేసిక్ సాలరీ + డియర్నెస్ అలవెన్స్) X పూర్తి చేసిన సర్వీస్ సంవత్సరాల సంఖ్య X (15/26)
ఉదాహరణకు, మీరు ఒక కంపెనీలో వరుసగా 7 ఏళ్లు పనిచేశారు. మీ బేసిక్ సాలరీ, డియర్నెస్ అలవెన్స్ రెండూ కలిపి రూ.35,000 అని అనుకుందాం. అప్పుడు మీకు వచ్చే గ్రాట్యుటీని ఎలా లెక్కిస్తారంటే, 35000 x (15/26/) X 7 = రూ.1,41,346.
గ్రాట్యుటీ ఎప్పుడు వస్తుంది?
Gratuity Eligibility Years : ఉద్యోగులు ఒక సంస్థలో 5 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నిరంతరంగా పనిచేస్తే, వారు గ్రాట్యుటీని పొందేందుకు అర్హులు అవుతారు. అయితే గ్రాట్యుటీ యాక్ట్ సెక్షన్-2ఏ ప్రకారం, అండర్‌గ్రౌండ్ మైన్స్‌లో పనిచేసే ఉద్యోగులు వరుసగా 4 ఏళ్ల 190 రోజుల పాటు పనిచేస్తే చాలు. వాళ్లు గ్రాట్యుటీకి అర్హులు అవుతారు. ఇతర సంస్థల్లో 4 సంవత్సరాల 240 రోజులు పనిచేస్తేనే గ్రాట్యుటీకి అర్హత లభిస్తుంది. ఉద్యోగం మానేసిన తరువాత లేదా పదవీ విరమణ చేసిన తరువాత మాత్రమే గ్రాట్యుటీ లభిస్తుంది. పని చేస్తున్నప్పుడు మీరు ఈ గ్రాట్యుటీని పొందలేరు. ఇక్కడ ఉద్యోగులు అందరూ ఒక కీలకమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు పని చేస్తున్న కంపెనీకి రాజీనామా సమర్పించి, నోటీస్ పీరియడ్‌లో ఉంటే, ఆ వ్యవధిని కూడా గ్రాట్యుటీ కోసం లెక్కిస్తారు. తరువాత మీరు ప్రస్తుత కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు లేదా మీ జీతం చివరి సెటిల్మెంట్ చేసేటప్పుడు, మీకు రావాల్సిన గ్రాట్యుటిని అందిస్తారు.
ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
Gratuity Rules In India : ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఒక ఉద్యోగి రాజీనామా చేసిన 30 రోజుల్లోపు అతనికి చెల్లించాల్సిన గ్రాట్యుటీని కంపెనీ యజమాన్యం చెల్లించాల్సి ఉంటుంది. కానీ కొన్ని సార్లు కంపెనీలు గ్రాట్యుటీని చెల్లించేందుకు నిరాకరిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఉద్యోగి కచ్చితంగా న్యాయబద్ధంగా పోరాడవచ్చు. ఇందు కోసం ఉద్యోగి ముందుగా కంపెనీ యాజమాన్యానికి లీగల్ నోటీస్ ఇవ్వాలి. తరువాత జ్యూరిస్డిక్షనల్ కంట్రోలింగ్ అథారిటీకి ఫిర్యాదు చేయాలి. అయితే ఉద్యోగి తను రాజీనామా చేసిన 90 రోజుల్లోపే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగి తన గ్రాట్యుటీ సమస్య గురించి లేబర్ కమిషనర్ జిల్లా కార్యాలయంలోనూ ఫిర్యాదు చేయవచ్చు.
30 రోజుల్లోపు చెల్లించాల్సిందే!
Gratuity Payment Rules 2023 : ఉద్యోగి తన గ్రాట్యుటీ కోసం దరఖాస్తు చేసిన తరువాత, యజమాని 15 రోజుల్లోపు, తాము చెల్లించే గ్రాట్యుటీ మొత్తాన్ని, గ్రాట్యుటీ అందించే తేదీని కచ్చితంగా తెలియజేయాలి. అలాగే దరఖాస్తు స్వీకరించిన 30 రోజుల్లోపు కచ్చితంగా ఉద్యోగికి గ్రాట్యుటీ అందించాలి.
ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చు? ఐటీ నోటీసు రాకూడదంటే ఎలా? - Gold Storage Limit In India
మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Best Mileage Bikes Under 1 Lakh