What Is AIS : ఆదాయ పన్ను శాఖ ట్యాక్స్ పేయర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెసులుబాట్లు తీసుకొస్తూనే ఉంది. ఇందులో 'వార్షిక సమాచార నివేదిక' (AIS) కూడా ఒకటి. పన్ను చెల్లింపుదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన ఆర్థిక లావాదేవీల వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి. ఐటీఆర్ దాఖలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయాలనే లక్ష్యంతోనే ఆదాయ పన్ను శాఖ ఈ ఏఐఎస్‌ను తీసుకువచ్చింది.
గతంలో
గతంలో ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసేందుకు ఫారం-16, ఫారం-26ఏఎస్‌లను పరిశీలించాల్సి వచ్చేంది. అయితే ఇప్పుడు వీటితోపాటు ఏఐఎస్ నివేదికను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ ఏఐఎస్ ద్వారా వేతనం ద్వారా వచ్చిన ఆదాయం, టీడీఎస్, సహా ఇతర మార్గాల్లో వచ్చిన రాబడుల వివరాలు అన్నీ తెలుసుకోవచ్చు.
AISలో ఉండే ప్రధానమైన వివరాలు ఇవే!
- సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్ సహా ఇతర పథకాలపై వచ్చిన వడ్డీ ఆదాయం
- ఆదాయ పన్ను రిఫండ్ పొందినప్పుడు, దానిపై అందిన వడ్డీ ఆదాయం
- మీకు పెట్టుబడులపై వచ్చిన డివిడెండ్లు
- లాటరీల్లో గెలుచుకున్న డబ్బు వివరాలు
- గవర్నమెంట్ సెక్యూరిటీలు, బాండ్లపై వచ్చిన వడ్డీ
- దీర్ఘకాలిక మూలధన లాభాలు
- బీమా కమీషన్
- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ల నుంచి వచ్చిన ఆదాయం
- జాతీయ పొదుపు పథకాల్లో జమ చేసిన మొత్తాన్ని వెనక్కు తీసుకున్నప్పుడు వచ్చిన రాబడి
- వాహనాలను అమ్మేసినప్పుడు వచ్చిన ఆదాయం
- మ్యూచువల్ ఫండ్ యూనిట్లను తిరిగి కొనుగోలు చేసినప్పుడు వచ్చిన రాబడి
- షేర్లను, మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించిన వివరాలు
- కరెంట్ అకౌంట్ మినహా ఇతర ఖాతాల్లో ఉన్న నగదు నిల్వలు
- విదేశాల నుంచి వచ్చిన డబ్బు వివరాలు లేదా విదేశాలకు పంపిన డబ్బు వివరాలు
- స్థిరాస్తి క్రయ, విక్రయాలపై వచ్చిన ఆదాయం - ఇలాంటి ఆదాయ వివరాలు అన్నీ ఏఐఎస్‌లో ఉంటాయి.
ఏఐఎస్ వివరాలు ఎలా చూడాలి?
How To Access AIS : ట్యాక్స్ పేయర్స్ ఏఐఎస్‌ను చాలా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఇందుకోసం ముందుగా మీరు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి. ఆ తరువాత సర్వీసెస్ ట్యాబ్‌లోకి వెళ్లి, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ (AIS) లింక్‌పై క్లిక్ చేయాలి. అంతే సింపుల్. మీకు ఏఐఎస్‌లోని ఆదాయ వివరాలు అన్నీ కనిపిస్తాయి. ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు పన్ను చెల్లింపుదారులు సులభంగా ఏఐఎస్‌ను చెక్ చేసుకోవడం కోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్‌ను కూడా తీసుకువచ్చారు.
సందేహం వస్తే!
ఏఐఎస్‌లో ఉన్న ఆదాయం, టీడీఎస్ వివరాలపై మీకు ఏమైనా అనుమానాలుంటే, వాటిని తెలియజేసేందుకు వీలుగా కొత్త సౌలభ్యాన్ని ఆదాయపు పన్ను శాఖ తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఏఐఎస్‌లో ఉన్న మీ ఆర్థిక లావాదేవీల వివరాలపై ఏమైనా సందేహాలు ఉంటే, అక్కడే వాటిని తెలియజేయవచ్చు. అప్పుడు దానిని సంబంధిత వర్గాల వివరణ కోసం పంపిస్తారు. తరువాత ఏఐఎస్‌లో ఏమైనా పొరపాట్లు ఉంటే, వాటిని సరిచేస్తారు. లేదా ధ్రువీకరిస్తారు. అందులో మీ సందేహాలకు సంబంధించిన జవాబులు, వివరణలు ఉంటాయి.
ప్రస్తుతాని ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఇంకా సమయం ఉంది. అందువల్ల ముందుగా ఏఐఎస్‌ను ఒకసారి సమీక్షించుకొని, వాటిలో ఏమైనా లోపాలు ఉంటే, వాటిని ముందుగానే సరి చేసుకోవడం చాలా మంచిది.
కార్ లోన్ గడువుకు ముందే తీర్చేయాలా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్! - Car Loan Prepayment
మీరు ఉద్యోగులా? ITR ఫైల్ చేసేటప్పుడు ఈ 5 విషయాలు మర్చిపోకండి! - Salaried Taxpayer ITR Filing