What Is Advance Tax : అడ్వాన్స్ ట్యాక్స్ గురించి మీరు చాలా సార్లు విని ఉంటారు. ఆదాయపు పన్ను శాఖ ఎప్పటికప్పుడు ముందస్తు పన్ను వసూళ్ల గణాంకాలను విడుదల చేస్తుంది. వాస్తవానికి ఇది ప్రభుత్వానికి సాధారణ ఆదాయ వనరు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు చెల్లించినందున, దీనిని ముందస్తు పన్ను అంటారు. ముందస్తు పన్ను చెల్లించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఈ పన్ను ఎప్పుడు, ఎలా చెల్లించాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
ముందుస్తు పన్ను అంటే ఏమిటి?
Advance Tax Meaning : నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో మీరు సంపాదించిన ఆదాయంపై ముందస్తుగానే చెల్లించే పన్ను అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు. దీన్ని ఏడాది చివరిలో ఒకసారి చెల్లించే బదులు, ఐటీ శాఖ నిర్దేశించిన తేదీల్లో తక్కువ మొత్తాల్లో చెల్లించవచ్చు.
ముందస్తు పన్ను ఎవరు చెల్లించాలి?
వ్యాపారవేత్తలు, జీతం పొందే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, నిపుణులు ముందస్తు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన పన్ను రూ.10,000 కంటే ఎక్కువ ఉంటే, అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించవచ్చు. జీతాలు తీసుకునే వారు ముందస్తు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి కారణం మీరు పని చేసే కంపెనీ టీడీఎస్ తీసివేసిన తర్వాత మీకు జీతం ఇస్తుంది. అందువల్ల జీతాలు తీసుకునే వ్యక్తులు ముందస్తు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, జీతం పొందే వ్యక్తికి ఇతర వనరుల నుంచి (అద్దె, డివిడెండ్, వడ్డీ లాంటివి) ఆదాయం ఉంటే అతని పన్ను బాధ్యత రూ.10,000 మించి ఉంటే, అప్పుడు అతను ముందస్తు పన్ను చెల్లించవలసి ఉంటుంది. 60 ఏళ్లు పైబడిన వారికి ముందస్తు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. కానీ వారికి వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఎలాంటి ఆదాయం ఉండకూడదనేది నిబంధన.
How To Calculate Advance Tax :
దశలవారీగా ముందస్తు పన్ను లెక్కించడం ఎలాగో తెలుసుకుందాం :
- మీ జీతంతో సహా మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నారో తెలుసుకోవాలి.
- మీ ఆదాయం నుంచి వైద్య బీమా, ఫోన్ బిల్లులు, ప్రయాణ ఖర్చులను తీసివేయాలి.
- ఎఫ్డీలు, ఇంటి అద్దె, లాటరీ ప్రైజ్ లాంటి అదనపు ఆదాయాలను చేర్చాలి.
- మీరు లెక్కించిన పన్ను మొత్తం రూ.10వేల కంటే ఎక్కువ ఉంటే మీరు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్లో కూడా అడ్వాన్స్ టాక్స్‌ను లెక్కించవచ్చు. అది ఎలా అంటే?
- ముందుగా మీరు (https://incopmetaxindia.gov.in/pages/default.aspx) వెబ్సైట్లోకి లాగిన్ కావాలి
- ఇప్పుడు నావిగేషన్ బార్‌లోని 'పన్ను సమాచారం సేవల'పై క్లిక్ చేయాలి.
- 'ట్యాక్స్ టూల్స్' సెలక్ట్ చేసుకుని 'అడ్వాన్స్ ట్యాక్స్ కాలిక్యులేటర్'పై క్లిక్ చేయాలి.
- (https://incometaxindia.gov.in/Pages/tools/advance-tax-calculator.aspx)
- ఇక్కడ అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసి, సబ్మిట్ చేయాలి.
- ఈ విధంగా మీరు ఐటీ శాఖ అధికారిక వెబ్సైట్లో ఎంత అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలో తెలుసుకోవచ్చు.
మీకు ఇంటి మీద ఆదాయం వస్తోందా? కచ్చితంగా ఈ 'ట్యాక్స్' వివరాలు తెలుసుకోండి!
ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాలా? సరైన ITR ఫారాన్ని ఎంచుకోండిలా! - How To Choose Right ITR Form