Warren Buffet Investing Lessons : స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం అనేది పెద్ద కళ. కొత్త పెట్టుబడిదారుడైనా, అనుభవజ్ఞుడైనా పెట్టుబడి పెట్టే ముందు కొన్ని బేసిక్స్‌పై అవగాహన పెంచుకోవాలి. గతంలో ఎదురైన వైఫల్యాలు, చేదు అనుభవాలను పాఠాలుగా చేసుకొని నిరంతర విద్యార్థిగా ప్రస్థానాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక సగటు వ్యక్తి తన తప్పుల నుంచి నేర్చుకుంటాడు. తన తప్పుల నుంచే నేర్చుకోవాలని భావిస్తే చాలా నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఇతరుల తప్పుల నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తే, మీరు ఏ మాత్రం నష్టపోకుండానే పకడ్బందీ పెట్టుబడి వ్యూహాన్ని అమలు చేసే అవకాశం కలుగుతుంది. పెట్టుబడి పెట్టే విషయంలో 'ప్రో'గా మారాలని భావించే వారికి వారెన్ బఫెట్‌కు మించిన రోల్ మోడల్ మరొకరు ఉండరు. ‘ఒరాకిల్ ఆఫ్ ఒమాహా’గా పేరొందిన బఫెట్ తన ప్రసంగాలు, చర్చలలో స్వయంగా వెల్లడించిన పెట్టుబడి పాఠాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వారెన్ బఫెట్ నుంచి నేర్చుకోవాల్సిన కీలక పెట్టుబడి పాఠాలు ఇవే!
1. సరైన ధరకు కొనండి : ఒక బలమైన కంపెనీ షేరును ఎక్కువ ధరకు కొనడం కంటే, ఒక అద్భుతమైన కంపెనీ షేరును సరసమైన ధరకు కొనడం చాలా బెటర్ అని వారెన్ బఫెట్ చెబుతారు. ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టే క్రమంలో ఎంతమేర అప్రమత్తంగా, వ్యూహాత్మకంగా ఉండాలనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీర్ఘకాలంలో రాణించే సత్తా కలిగిన కంపెనీలో సరసమైన షేర్ ప్రైస్‌తో పెట్టుబడి పెట్టడం ఎంతో సేఫ్ అని బఫెట్ అంటారు. ఉదాహరణకు యాపిల్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, కోకోకోలా వంటి కంపెనీలలో బఫెట్ పెట్టుబడి పెట్టారు. ఇక బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్వే సంస్థ ఇటీవలే యాపిల్ కంపెనీలో దాదాపు సగం వాటాను విక్రయించింది.
2. తక్కువ ధరకు పెద్దమొత్తంలో కొనండి : షేర్ ధర తక్కువగా ఉన్నప్పుడు భారీగా కొనుగోళ్లు చేయడానికి నగదు నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని బఫెట్ అంటారు. కనక వర్షం కురిసేటప్పుడు కావాల్సింది బకెట్ తప్ప బొటన వేలు కాదని ఆయన చెబుతారు. బఫెట్ సంస్థ బెర్క్‌షైర్ హాత్వే నగదు నిల్వలు ఇప్పుడు రూ.23 లక్షల కోట్లకు చేరుకున్నాయి. యాపిల్ కంపెనీలో తన వాటాను విక్రయించడానికి ముందు వరకు కూడా బెర్క్‌షైర్ హాత్వే వద్ద రూ.15 లక్షల కోట్ల నగదు లభ్యత ఉంది.
3. భావోద్వేగాలు వద్దు : పెట్టుబడులు పెట్టేవారు భావోద్వేగాల నిర్వహణలో సమర్ధులుగా ఉండాలని వారెన్ బఫెట్ అంటారు. తెలివైన పెట్టుబడిదారుడు ఇతరులు భయపడుతున్నప్పుడు అత్యాశతో ఉండాలని, ఇతరులు అత్యాశతో ఉన్న టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలని బఫెట్ సూచిస్తుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే, స్టాక్ మార్కెట్ బుల్ రన్‌లో ఉన్న టైంలో తెలివైన ఇన్వెస్టర్ భయపడాలి. ఎందుకంటే ఆ దశ తర్వాత మార్కెట్ కరెక్షన్‌కు లోనయ్యే అవకాశం ఉంది. మార్కెట్‌లో అందరూ షేర్లను అమ్ముతున్నప్పుడు, తెలివైన పెట్టుబడిదారుడు అత్యాశతో వ్యవహరించాలి. ఆకర్షణీయమైన ధరకు కొనే ప్రయత్నం చేయాలి.
4. సరైన సమయం : స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ జరిగే ప్రతీ దశలోనూ స్వింగ్‌లో ఉండాలని మదుపరులు భావించకూడదని బఫెట్ సూచిస్తుంటారు. మీకు తగిన సమయం వచ్చే వరకు వేచిచూడాలి. సరైన అవకాశం, సరైన సమయం వచ్చే దాకా పెట్టుబడి పెట్టే నిర్ణయాన్ని అస్సలు తీసుకోవద్దని ఆయన అంటారు.
5. ఇండెక్స్ ఫండ్‌లు బెస్ట్ : చాలా మంది ప్రొఫెషనల్ ఇన్వెస్టర్‌ల కంటే వారెన్ బఫెట్ చాలా డిఫరెంట్. అమెరికాలోని ‘ఎస్ అండ్ పీ 500’ (భారతదేశంలో నిఫ్టీ50 లాంటిది) ఇండెక్స్ ఫండ్‌లను ఆయన బాగా నమ్ముతారు. రిటైల్ ఇన్వెస్టర్లు ఇండెక్స్ ఫండ్‌ను నమ్ముకోవడం మంచిదని బఫెట్ సూచిస్తుంటారు.
6. లాంగ్ హోల్డింగ్ పీరియడ్ : ఏదైనా స్టాక్‌ను కొంటే దాన్ని దీర్ఘకాలం పాటు ఉంచుకోవాలి. ఉదాహరణకు యాపిల్ కంపెనీ స్టాక్స్‌ను బఫెట్ తన వద్ద సుదీర్ఘకాలం పాటు ఉంచుకున్నారు. ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక వ్యూహంతోనే ఉండాలని ఆయన సూచిస్తారు. ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా ఆయన తన పోర్ట్‌ఫోలియోలో ఏ మాత్రం మార్పులు చేయలేదు. అందుకే ఆయనను 'ఎకనామిక్ పెర్ల్ హార్బర్' అని పిలుస్తుంటారు.
బాగా ధనవంతులు కావాలని ఆశపడుతున్నారా? ఈ 'సక్సెస్ ఫార్ములా' మీ కోసమే! - How To Become Rich