Upcoming 7 Seater Cars In India : ప్రస్తుతం కుటుంబంతో కలిసి టూర్ వెళ్లాలన్నా, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలన్నా కారు ఉండాల్సిందే. అయితే 7సీటర్ కారైతే ఇంటిల్లిపాది సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. ఈ క్రమంలో 7సీటర్ సామర్థ్యంతో మరికొన్ని నెలల్లో మార్కెట్లోకి కొన్ని కార్లు మార్కెట్లో విడుదల కానున్నాయి. అందులో టాప్-5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. MG Gloster Facelift : మరికొద్ది నెలల్లో 7సీట్ల సామర్థ్యంతో ఎమ్జీ గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్ మోడల్ కారు మార్కెట్లోకి రానుంది. ఈ కారును లాంఛ్ చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. ఎంజీ గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్ లో ఇంజిన్ కాకుండా ఇతర మార్పులు చాలా ఉండవచ్చని తెలుస్తోంది. అదే సమయంలో మార్కెట్లో అగ్రశ్రేణి ఎస్‌యూవీగా ఉన్న టొయోటా ఫార్చ్యూనర్‌కు ఈ కారు గట్టి పోటీ ఇవ్వవచ్చని అంచనా. ఎమ్జీ గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్ మోడల్లో ఇంటీరియర్, ఎక్స్టీరియర్ను అప్‌గ్రేడ్ చేయవచ్చని తెలుస్తోంది.
2. New Kia Carnival : మరికొద్ది నెలల్లో ఫోర్త్ జనరేషన్ కియా కార్నివాల్ మోడల్ కారు భారత విపణిలోకి రానుంది. గత మోడల్ కంటే ఇది భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. న్యూ కియా కార్నివాల్ మోడల్ కారు కేబిన్ ఉన్నత స్థాయి ప్రమాణాలతో రూపొందించినట్లు సమాచారం. 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్‌తో ఈ మోడల్ కారు రానున్నట్లు తెలుస్తోంది. 7సీటర్ సామర్థ్యంతో ఈ మోడల్ కారు మార్కెట్లోకి రానుంది.
3. Nissan X-Trail : నిస్సాన్ ఎక్స్ ట్రైల్ మోడల్ కారు మరో రెండు నెలల్లో భారత మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ కారు 1.5 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉండనుందని భావిస్తున్నారు. పరిమిత సంఖ్యలో ఈ మోడల్ కార్లు మార్కెట్లోకి దింపనున్నట్లు సమాచారం. 7 సీట్ల సామర్థ్యంతో ఈ కారు మార్కెట్లోకి రానుంది.
4. Kia EV9 : కియా ఈవీ-9 ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంవత్సరం ప్రారంభంలో లాంఛ్ కావొచ్చు. ఈ 7సీటర్ కారు, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే, 12.3 అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, పనోరమిక్ సన్ రూఫ్, వైర్ లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లతో రానున్నట్లు తెలుస్తోంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 541 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని సమాచారం.
5. Jeep Meridian Facelift : ప్రముఖ కార్ల తయారీ కంపెనీ జీప్, తమ మెరిడియన్ కారుకి ఫేస్ లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. 7 సీట్ల సామర్థ్యంతో ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి రానుంది. అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, మంచి ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. కొత్త గ్రిల్, ఫ్రంట్, రియర్ బంపర్లు, కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్‌తో ఈ మోడల్ కారు మార్కెట్లోకి రానుంది.