TRAI On Spam Messages : మోసపూరిత కాల్స్, సందేశాలు పంపే టెలిమార్కెటర్లపై, టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కఠిన చర్యలకు దిగింది. వినియోగదారులను మోసపూరిత కాల్స్ నుంచి రక్షించేందుకు, మెసేజింగ్ సేవలు దుర్వినియోగం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని టెలికాం సంస్థలను ట్రాయ్ మంగళవారం ఆదేశించింది. సెప్టెంబరు 1 నుంచి వైట్‌లిస్టెడ్ (ధ్రువీకరణ) లేని యూఆర్‌ఎల్‌లు, ఓటీటీ లింక్‌లు లేదా కాల్ బ్యాక్ నంబర్లు కలిగిన మెసేజ్‌లను సెండర్‌లు పంపించకుండా సర్వీస్ ప్రొవైడర్లు ఆపాలని ట్రాయ్ స్పష్టం చేసింది. నవంబరు 1 నుంచి సెండర్స్ నుంచి రిసీపియెంట్స్‌కు వచ్చే అన్ని మెసేజ్‌ల వివరాలు తెలుసుకునే విధంగా ఉండాలని ట్రాయ్ ఆదేశించింది.
ట్రాయ్ ఆదేశాల ప్రకారం, ఇకపై ఎక్కడి నుంచి మెసేజ్ వచ్చిందో వివరాలు లేకుంటే, దాన్ని తిరస్కరిస్తారు. టెలికాం వినియోగదారులకు చేసే ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌లు పంపే అనధికార టెలిమార్కెటర్లకు తాజా చర్యలతో కళ్లెం పడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. స్పామ్ కాల్స్ చేసే అనధికార టెలిమార్కెటర్ల కనెక్షన్‌లను తొలగించడంతో పాటు, రెండేళ్ల పాటు వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల్సిందిగా టెల్కోలను ట్రాయ్ (TRAI) గతవారం ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రమోషనల్ కంటెంట్ కోసం టెంప్లెట్‌లను దుర్వినియోగం చేసే వారిని అడ్డుకోకుంటే, సెండర్‌లపై ట్రాయ్ చర్యలు తీసుకోనుంది. నెల రోజుల పాటు వారి సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. ట్రాయ్ హెచ్చరికల నేపథ్యంలో ఆయా టెలికాం కంపెనీలు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నాయి. స్పామ్ కాల్స్‌ను అరికట్టేందుకు ఇది ఒక ముందడుగుగా చెప్పుకోవచ్చు.
సిమ్ స్వాప్
ట్రాయ్ ఇప్పటికే సిమ్ స్వాప్, రీప్లేస్‌మెంట్ మోసాలను అరికట్టడాని పలు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. టెక్నాలజీ పెరిగిన తరువాత కొంత మంది కేటుగాళ్లు, వ్యక్తుల సమాచారాన్ని తస్కరించి, వారి సిమ్‌కార్డులను పోర్ట్ చేయడం లాంటి మోసాలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇలాంటి మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల భద్రత కోసం, వారి సమాచారాన్ని సురక్షితంగా ఉంచడం కోసం ట్రాయ్ పలు కొత్త నిబంధనలను తీసుకువచ్చింది.
కనీసం 7 రోజులు ఆగాల్సిందే!
ఇప్పటి వరకు ఎలా ఉండేదంటే, పొరపాటున మన ఫోన్ పోయినా, లేదా ఎవరైనా దొంగిలించినా, ఎఫ్‌ఐఆర్ కాపీని అందిస్తే చాలు. మనకు కొత్త సిమ్ కార్డ్ వచ్చేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. జులై 1 నుంచి ఇలాంటి ఘటన ఏదైనా జరిగితే, కొత్త సిమ్ కోసం కనీసం 7 రోజుల పాటు వేచి ఉండాల్సిందే.