Sundar Pichai To Be Billionaire : గూగుల్ పేరెంట్ కంపెనీ ఇద్దరు వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్జీ బ్రిన్‌ల పేర్లు ప్రపంచంలోని టాప్-10 ధనవంతుల జాబితాలో ఉన్నాయి! అలాంటి అపర కుబేరుల నమ్మకాన్ని చూరగొన్న సుందర్ పిచాయ్ కూడా ఇప్పుడు బిలియనీర్ కాబోతున్నారు. అంటే ఆయన నికర సంపద విలువ 100 కోట్ల డాలర్లకు చేరువైంది. 'బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్' ఈ విషయాన్ని వెల్లడించింది.
ఆ ఘనత సుందర్‌దే!
సాధారణంగా కంపెనీల వ్యవస్థాపకుల సంపదే ఇంతటి స్థాయికి చేరుతుంటుంది. కానీ సాధారణ ఉద్యోగిలా ప్రొడక్ట్ మేనేజర్ హోదాలో గూగుల్‌లో చేరిన సుందర్ పిచాయ్ అసాధారణంగా ఉన్నత స్థానాలకు ఎదిగారు. తనకు గూగుల్ కంపెనీ అప్పగించిన టాస్క్‌లను విజయవతంగా పూర్తి చేశారు. తొలుత గూగుల్ క్రోమ్, గూగుల్ టూల్ బార్స్‌ను డెవలప్ చేసి నెటిజన్లకు చేరువ చేసిన ఘనత సుందర్‌కే దక్కుతుంది. ఈ విషయాన్ని గూగుల్ యజమానులు కూడా అంగీకరించారు.
అందుకే సుందర్ పిచాయ్‌కు సీఈఓ హోదాను కట్టబెట్టారు. 2015లో గూగుల్‌లో ఈ హోదాను పొందిన సుందర్, గత తొమ్మిదేళ్లలో వేతనం, ఇతర భత్యాలు, ప్రోత్సాహకాల రూపంలో బాగానే సంపాదించారు. ఆయనకు కేటాయించిన 'ఆల్ఫాబెట్ కంపెనీ' షేర్ల ధరలు కూడా గత తొమ్మిది సంవత్సరాల వ్యవధిలో బాగా పెరిగాయి. ఆ స్థాయిలో గూగుల్ మార్కెట్ విలువను పెంచేలా వ్యాపార ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చి, వాటిని ప్రజలకు చేరువ చేశారు సుందర్.
కంపెనీ షేరు విలువకు రెక్కలు!
ఓ అంచనా ప్రకారం గూగుల్ పేరెంట్ కంపెనీ 'ఆల్ఫాబెట్' షేరు విలువ దాదాపు 400 శాతం కంటే ఎక్కువ పెరిగింది. ప్రత్యేకించి గూగుల్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ గత మూడు నెలల్లో అద్భుతంగా రాణించింది. దాని ఏఐ టూల్స్ జనంలో మంచి ఆదరణ పొందాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్యకాలానికి సంబంధించిన మొదటి త్రైమాసికంలో ఆల్ఫాబెట్ కంపెనీ అద్భుత ఆర్థిక ఫలితాలను సాధించింది. అంతేకాదు గూగుల్ కంపెనీ తమ షేర్ హోల్డర్లకు తొలిసారిగా డివిడెండ్ కూడా ప్రకటించింది. ఈ పరిణామాలన్నీ కలిసొచ్చి త్వరలోనే సుందర్ పిచాయ్ బిలీయనీర్ కాబోతున్నారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది.
విధి నిర్వహణలో అంకిత భావానికి పేరుగాంచిన సుందర్ పిచాయ్‌ను 2015 సంవత్సరంలో గూగుల్ సీఈఓగా ఆ కంపెనీ వ్యవస్థాపకుడు లారీ పేజ్ నియమించారు. అంతకుముందు వరకు గూగుల్ సీఈఓగా లారీ పేజ్ ఉండేవారు. అయితే ఆయన గూగుల్ పేరెంట్ కంపెనీ 'ఆల్ఫాబెట్'కు సీఈఓగా ప్రమోట్ అయ్యారు. ఈ విధంగా ఖాళీ అయిన గూగుల్ సీఈఓ పదవిని సమర్ధుడైన సుందర్ పిచాయ్‌కు అప్పగించారు.
రోజుకు రూ.5కోట్లు జీతం - ఆమె చెప్పిన ఒక్క మాటతో సుందర్ కథ సూపర్ హిట్!
గూగుల్ CEO పిచాయ్‌కు 1,850 కోట్లు.. ఉద్యోగుల కంటే 800 రెట్లు ఎక్కువ!