Stock Market Investment Tips : మంగళవారం (జూన్ 4) నాడు దేశీయ స్టాక్ మార్కెట్లు కనీ, వినీ ఎరుగని నష్టాలతో కుప్పకూలిపోయాయి. దీనితో మదుపరుల సంపద ఏకంగా రూ.35 లక్షల కోట్ల వరకు ఆవిరైపోయింది. ఇలా నష్టపోయిన వాళ్లలో మీరూ ఉన్నారా? అయితే ఇది మీ కోసమే.
'భారీ నష్టాల్లో ఉన్నామనే ఆందోళనను విడిచిపెట్టండి. మనోనిబ్బరంతో ఉండండి. భావోద్వేగాలకు లోనై, తొందరపడి మీరు కొన్న షేర్లను నష్టాలకు అమ్మేయకండి. వాటిని అలాగే అట్టిపెట్టండి. ఎందుకంటే దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లు కోలుకుని, మంచి లాభాలు ఇచ్చే అవకాశం ఉంది' అని పలువురు నిపుణులు చెబుతున్నారు.
అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టవద్దు!
స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజారిటీ బీజేపీకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ప్రధాని మోదీ, అమిత్‌షా కూడా స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకుపోతాయని జోస్యం చెప్పారు. దీనితో చాలా మంది మదుపరులు భారీ లాభాలు వస్తాయనే ఆశతో మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. దీనితో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు గడించాయి. కానీ మంగళవారం వచ్చిన ఎన్నిక ఫలితాల్లో బీజేపీకి అనుకున్నంత మెజారిటీ రాలేదు. దీనితో మార్కెట్లు కనీ, వినీ ఎరుగని భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఫలితంగా మదుపరులు భారీగా నష్టపోయారు.
దీనికంతటికీ ప్రధాన కారణం, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్‌పై మదుపరులకు సరైన అవగాహన లేకపోవడమే. దీనికి తోడు రాజకీయ నాయకులు కూడా చాలా బాధ్యతా రాహిత్యంతో, లేనిపోని ప్రకటనలు చేశారు. సోషల్ మీడియా గురించి చెప్పాల్సిన పనేలేదు. నకిలీ ఫైనాన్సియల్ ఎక్స్‌పర్ట్‌లు మార్కెట్లు లాభాల పంట పండిస్తాయని ఊరించారు. నోటికి వచ్చిన స్టాక్ రికమండేషన్లు చేశారు. ఇవన్నీ గుడ్డిగా నమ్మి చాలా మంది ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో తమ కష్టార్జితాన్ని పెట్టారు. చివరికి భారీగా నష్టపోయి, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, మానసిక వేదనకు గురవుతున్నారు. అందుకే సరైన అవగాహన లేకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇప్పుడు ఏం చేయాలి?
భారీ నష్టాల్లో కూరుకుపోయిన మదుపరులు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక మానసిక వేదనకు గురవుతున్నారు. అయితే వీరు మనోనిబ్బరంతో ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. బీజేపీ సింగిల్‌గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవచ్చు. కానీ ఎన్డీఏ కూటమిలోని మద్దతుదారులతో కలిసి కచ్చితంగా అధికారం చేపట్టే పరిస్థితి ఉంది. అందువల్ల త్వరలోనే మార్కెట్లు తిరిగి కోలుకుంటాయి. అందువల్ల మదుపరులు అందరూ తాము కొన్న షేర్లను అలాగే దీర్ఘకాలం పాటు హోల్డ్ చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
పెన్నీ స్టాక్స్ వద్దు!
స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ఉన్నప్పుడు కూడా అన్ని షేర్ల ధరలు పెరగవు. కానీ మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నప్పుడు చాలా వరకు పెన్నీ, స్మాల్ట్, మిడ్ క్యాప్ స్టాక్స్ విలువలు పతనమవుతాయి. వీటిలో చాలా స్టాక్స్ తిరిగి కోలుకోవు కూడా. ఒక వేళ అవి కోలుకోవాలన్నా చాలా కాలం పడుతుంది.
లార్జ్ క్యాప్ స్టాక్స్ విషయంలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. ఇవి తాత్కాలికంగా నష్టపోయినా, తిరిగి త్వరగానే కోలుకునే పరిస్థితి ఉంటుంది. పైగా దీర్ఘకాలంలో మంచి లాభాలు ఇచ్చే వీలుంటుంది. అందుకే మదుపరులు పెన్నీ, స్మాల్ క్యాప్ స్టాక్స్ కంటే, మిడ్, లార్జ్ క్యాప్ స్టాక్స్‌ను తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవడం చాలా మంచిదని మార్కెట్ నిపుణలు సూచిస్తున్నారు.
అంతేకాదు షేర్లు కొనే ముందు, ఆ షేర్ వాస్తవ విలువ ఎంత? ధర ఆకర్షణీయంగా ఉందా? లేదా? అనేది కూడా చూసుకోవాలి. అంతేకానీ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి కదా అని ఏది బడితే అది కొనేయకూడదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, భారీ లాభాల్లో ఉందనే కారణంతో ఎలాంటి స్టాక్నైనా ఛేజ్ చేసి కొనేయకూడదు.
అత్యుత్సాహం వద్దు!
చాలా మంది మార్కెట్ ర్యాలీ కొనసాగుతున్నప్పుడు మంచి లాభాలు మిస్ అవుతున్నామనే భావంతో మార్కెట్లోకి ప్రవేశిస్తారు. కానీ ఒకవేళ పరిస్థితులు తారుమారు అయితే, ఎంత భారీ నష్టం వస్తుందో పట్టించుకోరు. చివరికి తీవ్రంగా నష్టపోయి, ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతుంటారు. అందుకే ఇన్వెస్టర్లు ఎప్పుడూ తమ భావోద్వేగాలను, అత్యాశలను అదుపులో ఉంచుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
దీర్ఘకాలిక పెట్టుబడులే బెస్ట్!
చరిత్ర చూసుకుంటే, ఏ ఇతర పెట్టుబడి/పొదుపు పథకాలతో పోల్చినా దీర్ఘకాలంలో స్టాక్ మార్కెట్లు మంచి లాభాలనే అందించాయి. కనుక మార్కెట్లో స్వల్పకాలిక ఒడుదొడుకులను చూసి భయపడిపోవద్దు. భారీ నష్టాలకు మీ షేర్లను అమ్మేయవద్దు. లార్జ్, మిడ్ క్యాప్ షేర్లను, మంచి గ్రోత్ వాల్యూ ఉన్న స్టాక్స్‌ను మీ పోర్ట్‌ఫోలియోలో అట్టే హోల్డ్ చేసి ఉంచుకోండి. మార్కెట్లు మళ్లీ పుంజుకుని మంచి లాభాల్లో ఉన్నప్పుడు అవసరమైతే వాటిని క్యాష్ చేసుకోండి.
నిపుణులు ఏమంటున్నారు?
లార్జ్ క్యాప్ షేర్లే బెస్ట్ :
"ఎన్నికల ఫలితాల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయినప్పటకీ, కేంద్రంలో మళ్లీ మోదీ సర్కార్ వచ్చే అవకాశముంది. కనుక మార్కెట్లు మళ్లీ పుంజుకునే ఛాన్స్ బాగా ఉంది. అందుకే మదుపరులు స్వల్పకాలంలో వచ్చే హెచ్చుతగ్గులకు భయపడకుండా తమ ఇన్వెస్ట్మెంట్లను కొనసాగించాలి. పెన్నీ, స్మాల్ క్యాప్ స్టాక్స్‌కు బదులుగా, మిడ్, లార్జ్ క్యాప్ షేర్లపై పెట్టుబడులు పెట్టాలి. ఎందుకంటే అన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకుని నిలిచే శక్తి లార్జ్ క్యాప్ షేర్లకు బాగా ఉంటుంది."
- ప్రదీప్ గుప్తా, వైస్‌ఛైర్మన్, ఆనంద్ రాఠీ
ఆర్థిక అంశాలే కీలకం
"స్టాక్‌మార్కెట్లు ప్రధానంగా ఆర్థికాంశాలపై ఆధారపడి ఉంటాయి. ఇతర అంశాల ప్రభావం ఎప్పుడూ తాత్కాలికమే. కనుక ఆర్ధిక విధానాలు, జీడీపీ, ద్రవ్యోల్బణం, ప్రపంచ దేశాల్లోని పరిస్థితులు మొదలైన అంశాలను పరిశీలించాలి. ప్రభుత్వం స్థిరమైన విధానాలు అనుసరిస్తే, స్టాక్‌మార్కెట్ పెట్టుబడులపై మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది."
- సుమన్ బెనర్జీ, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్, హెడోనోవా
నోట్ : ఈ ఆర్టికల్‌లో ఆర్థిక నిపుణుల సూచనలు మాత్రమే ఇవ్వడం జరిగింది. మీరు మాత్రం స్టాక్ మార్కెట్ పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా కీలకమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణులను సంప్రదించడమే మంచిది.
'మోదీ 3.0 సర్కార్'కు అంత ఈజీ కాదు! వారు ఓకే అంటేనే అవన్నీ సాధ్యం!! - BJP Economic Reform Challenges
EPF అకౌంట్లోని మీ వివరాలు మార్చుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - EPF KYC Correction