Stock Market Close October 22, 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీలు 1 శాతం మేర పతనం అయ్యాయి. క్యాపిటల్ మార్కెట్ల నుంచి భారీగా విదేశీ నిధులు తరలివెళ్లడం, గ్లోబల్ ఈక్విటీల మందగమనమే ఇందుకు కారణం. దీనికితోడు బలహీనమైన ఆదాయ వృద్ధి ధోరణి కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 930 పాయింట్లు నష్టపోయి 80,220 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 309 పాయింట్లు కోల్పోయి 24,472 వద్ద ముగిసింది.
- లాభపడిన షేర్లు : ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్
- నష్టపోయిన షేర్లు : ఎం అండ్ ఎం, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, మారుతి సుజుకి, హ్యుందాయ్
లిస్టింగ్ రోజే 7% లాస్
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిస్టింగ్ రోజే 7 శాతం వరకు నష్టపోయింది. ఇష్యూ ధర రూ.1960 ఉండగా, మార్కెట్ ముగిసేనాటికి రూ.1820కు పడిపోయింది. దీనితో లిస్టింగ్ గెయిన్స్ కోసం ఆశించిన మదుపరులు బాగా నష్టపోయారు.
హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 17న ముగిసింది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.1865-1960గా నిర్ణయించింది. గరిష్ఠ ధరల శ్రేణి వద్ద రూ.27,870 కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో మార్కెట్లోకి వచ్చింది. సంస్థాగత మదుపరుల అండతో, ఇది 2.37 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. దీనితో ఇప్పటి వరకు ఎల్‌ఐసీనే (రూ.21,000 కోట్లు) అతిపెద్ద ఐపీఓగా ఉండగా, హ్యుందాయ్ మోటార్స్ దాన్ని అధిగమించింది.
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, సోమవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.2,261.83 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు. అదే సమయంలో దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.3,225.91 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.
గ్లోబల్ మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో సియోల్, టోక్యోలు నష్టాలతో ముగిశాయి. షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు లాభపడ్డాయి. యూఎస్ మార్కెట్లు సోమవారం మిక్స్‌డ్ నోట్‌తో ముగిశాయి. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ
ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.84.07గా ఉంది.
ముడి చమురు ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 0.61 శాతం పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 74.74 డాలర్లుగా ఉంది.