Stock Market All Time High : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం రికార్డు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 535 పాయింట్లు లాభపడి 73,158 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 162 పాయింట్లు వృద్ధి చెంది 22,217 దగ్గర ఆల్‌టైమ్ హై క్లోజింగ్‌ను నమోదు చేసింది. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల మధ్య గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత కోలుకున్నాయి. టీసీఎస్, ఐటీసీ, రిలయన్స్ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. కనిష్ఠాల నుంచి సెన్సెక్స్ 1100 పాయింట్లు ఎగబాకింది.
గురువారం ఉదయం సెన్సెక్స్ 72,677.51 వద్ద ప్రారంభమై మెల్లగా నష్టాల్లోకి జారుకుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు నష్టాల్లో కొనసాగిన సూచీ కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్ ముగిసే సమయానికి భారీగా పుంజుకుంది. ఇంట్రాడేలో 73,256.39 వద్ద గరిష్ఠాన్ని తాకింది. 284.66 కోట్ల విలువైన సెక్యూరిటీలను కొనుగోళ్లతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) బుధవారం నికర కొనుగోలుదారులుగా నిలిచారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ ఏకంగా 13 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.83గా ఉంది.
లాభాల్లో కంపెనీల షేర్లు
హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, ఎంఅండ్‌ఎం, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, విప్రో, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, రిలయన్స్, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, టైటాన్, బజాజ్ ఫిన్సెర్వ్
నష్టాల్లో ఈ కంపెనీల స్టాక్స్
అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, హిందుస్థాన్ యూనిలివర్, ఎస్బీఐఎన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహేంద్రా, ఇండస్‌ఇండ్ బ్యాంక్
ముడిచమురు ధర
Crude Oil Prices February 22nd 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.13 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 83.14 డాలర్లుగా ఉంది.
మారుతి కార్ కొనాలా? ఆ మోడల్ కోసం 4 నెలలు వేచిచూడాల్సిందే!
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు- హైదరాబాద్, విజయవాడలో ఎంతంటే?